Holiday Update : వక్ఫ్ బోర్డు రిక్వెస్ట్.. సర్కార్ గ్రీన్ సిగ్నల్.. సెలవుల లెక్క మారిపోయింది
Holiday Update : తెలంగాణలో రంజాన్ పండుగ సెలవుల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు, విద్యార్థులకు ఊరట లభించడమే కాకుండా, వరుస సెలవుల సందడి నెలకొంది.
Ramzan Holidays ,
Holiday Update : తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించిన సెలవుల క్యాలెండర్లో తాజాగా కొన్ని మార్పులు చేసింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు, గతంలో మార్చి 13న ఉన్న ఐచ్ఛిక సెలవును మార్చి 20వ తేదీకి (శుక్రవారం) మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మార్చి 21న ఉండాల్సిన సెలవును కూడా పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేస్తూ కొత్త జీవోను విడుదల చేసింది. దీనివల్ల రంజాన్ పండుగ సందర్భాన్ని బట్టి సెలవులను వాడుకునే వెసులుబాటు ఉద్యోగులకు కలిగింది.
వరుసగా మూడు రోజులు సెలవులే
తెలంగాణలో రంజాన్ సందర్భంగా ఈసారి సెలవుల పండుగ రానుంది. ప్రభుత్వం మార్చి 20 (శుక్రవారం) ఆప్షనల్ హాలిడేగా ప్రకటించగా, మార్చి 21 (శనివారం) రంజాన్ పండుగ సెలవుగా ఉంది. ఆ తర్వాత రోజైన మార్చి 22 ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఉంటుంది. అంటే, ఈ లెక్కన తెలంగాణలోని చాలా మంది ఉద్యోగులు, విద్యార్థులకు శుక్ర, శని, ఆదివారాలు వరుసగా మూడు రోజులు సెలవులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇది నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పండుగ తేదీల్లో మార్పు వచ్చినా, ప్రభుత్వం ఇప్పటికే ఆప్షనల్ హాలిడేను 20కి మార్చడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.
నెలవంక దర్శనం
ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యాయి. సరిగ్గా నెల రోజులకు అంటే మార్చి 19 (గురువారం) సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపిస్తే, శుక్రవారం (మార్చి 20) పండుగ జరుపుకుంటారు. ఒకవేళ గురువారం నెలవంక కనిపించకపోతే, శనివారం (మార్చి 21) పండుగ ఉంటుంది. సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో ఒక రోజు ముందుగానే పండుగ జరుపుకుంటున్నప్పటికీ, మన దేశంలో చంద్రుడి దర్శనాన్ని బట్టి మత పెద్దలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త పడి సెలవుల జీవోలో సవరణలు చేసేసింది.
మార్చి చివరిలో మరో లాంగ్ వీకెండ్
ఈ రంజాన్ సెలవుల సందడి ముగిసిన వెంటనే, మరో లాంగ్ వీకెండ్ కూడా సిద్ధంగా ఉంది. మార్చి 27 (శుక్రవారం) శ్రీరామనవమి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారిక సెలవు ఉంది. ఆ తర్వాత శని, ఆదివారాలు ఎలాగూ సెలవులు ఉంటాయి కాబట్టి, మరోసారి వరుసగా మూడు రోజులు విశ్రాంతి దొరకనుంది. ఇలా మార్చి నెలలో పండుగలు, సెలవులతో తెలంగాణ ప్రజలకు వరుసగా ఫుల్ హ్యాపీ వీకెండ్స్ ఎదురుచూస్తున్నాయి.




