Peddapalli: మట్టి మాఫియా ఆటకట్టించిన గ్రామస్తులు: ఎల్లమ్మ గుట్ట వద్ద ఉద్రిక్తత!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో అక్రమ మట్టి రవాణాను గ్రామస్తులు అడ్డుకున్నారు.
Peddapalli: మట్టి మాఫియా ఆటకట్టించిన గ్రామస్తులు: ఎల్లమ్మ గుట్ట వద్ద ఉద్రిక్తత!
కాల్వ శ్రీరాంపూర్ (పెద్దపల్లి జిల్లా): కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అక్రమ మట్టి రవాణా దందా యథేచ్ఛగా సాగుతోంది. పెగడపల్లి సమీపంలోని ప్రసిద్ధ ఎల్లమ్మ గుట్ట నుంచి గుట్టుచప్పుడు కాకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆదివారం గ్రామస్తులు సాహసంతో అడ్డుకున్నారు.
అసలేం జరిగిందంటే:
పెగడపల్లి ఎల్లమ్మ గుట్ట ప్రాంతం నుంచి ఈరోజు తెల్లవారుజాము నుండి వరుసగా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన గ్రామస్తులు ఆరా తీయగా, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఈ తవ్వకాలు సాగుతున్నాయని తేలింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఏకమై టిప్పర్లను నిలిపివేసి అడ్డుకున్నారు.
పోలీస్ స్టేషన్‌కు టిప్పర్లు:
అనుమతి పత్రాలు చూపించడంలో టిప్పర్ డ్రైవర్లు విఫలం కావడంతో, గ్రామస్తులు వాటిని నేరుగా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విలువైన ప్రకృతి సంపదను, గుట్టలను కొల్లగొడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక పోలీస్ యంత్రాంగం ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించి, టిప్పర్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది.




