New Traffic Rules : ట్రాఫిక్ చలాన్లపై సర్కార్ సర్జికల్ స్ట్రైక్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కఠిన నిబంధనలు
New Traffic Rules : ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. 5 కంటే ఎక్కువ పెండింగ్ చలాన్లు ఉంటే ఆర్సీ, లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తారు.
traffic police
New Traffic Rules : మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయా? తర్వాత చూద్దాంలే.. ప్రభుత్వం ఎప్పుడైనా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించినప్పుడు కట్టుకోవచ్చు అని లైట్ తీసుకుంటున్నారా? అయితే మీరు భారీ చిక్కుల్లో పడబోతున్నారు. ఏప్రిల్ 1, 2026 నుంచి ట్రాఫిక్ నిబంధనలు అస్సలు ఊహించని విధంగా కఠినం కాబోతున్నాయి. ఇకపై చలాన్లు కట్టకుండా తప్పించుకోవడం కుదరదు సరికదా.. మీ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ కొత్త రూల్స్‌ను పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నయా రూల్స్
కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను భారీగా సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం, ఒక వాహనంపై ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, వాటిని నిర్ణీత సమయంలోపు చెల్లించకపోతే.. ఆ వాహన యజమాని డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఫ్రీజ్ చేయబడుతుంది. అంటే, చట్టపరంగా ఆ వాహనం రోడ్డుపై తిరగడానికి అనర్హమైనదిగా పరిగణించబడుతుంది. ఒకవేళ లైసెన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత కూడా వాహనాన్ని రోడ్డుపైకి తీస్తే, పోలీసులు దానిని వెంటనే సీజ్ చేస్తారు.
నిర్లక్ష్యం చేస్తే వెహికల్ సీజ్
ఇకపై చలాన్ పడిన తర్వాత దానిని చెల్లించడానికి గరిష్టంగా 45 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ గడువు ముగిసినా ఫైన్ పే చేయని పక్షంలో, ఆ వాహనంపై అధికారులు చర్యలు ప్రారంభిస్తారు. వాహనాన్ని రోడ్డు మీద నడపకపోయినా, ఇంట్లో పెట్టుకున్నా సరే.. డేటాబేస్‌లో అది బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో వాహనాన్ని అమ్మాలన్నా లేదా ఇన్సూరెన్స్ రీన్యూవల్ చేయాలన్నా సాధ్యపడదు. ప్రభుత్వం గతంలో ఇచ్చినట్లుగా చలాన్లపై భారీ డిస్కౌంట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
తప్పుడు చలాన్లు పడితే ఏం చేయాలి?
కొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల లేదా కెమెరా తప్పుగా రీడ్ చేయడం వల్ల ఒకరి చలాన్ మరొకరికి పడుతుంటుంది. ఇలాంటి తప్పులను సరిదిద్దడానికి ప్రభుత్వం గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది. చలాన్ పడిన వెంటనే మీ అభ్యంతరాలను ఇక్కడ వ్యక్తం చేయవచ్చు. ఒకవేళ అది నిజంగానే పొరపాటు అని తేలితే, నిర్ణీత సమయంలోపు ఆ చలాన్‌ను రద్దు చేస్తారు. దీని కోసం ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
నెలకు ఒకసారి ఆన్‌లైన్ చెక్ చేసుకోండి
వాహనదారులు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ పోలీసులు నేరుగా ఆపకపోయినా, సీసీ కెమెరాల ద్వారా చలాన్లు ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతున్నాయి. కాబట్టి, మీకు మెసేజ్ రాకపోయినా సరే.. కనీసం నెలకోసారి ఆన్‌లైన్‌లో మీ వెహికల్ నంబర్‌తో చలాన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవడం మంచిది. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్ జంప్ చేయకపోవడం వంటి ప్రాథమిక నియమాలు పాటిస్తే.. ఈ కఠిన నిబంధనల నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే మాత్రం మీ వాహనం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఖాయం.




