Seethakka: అసెంబ్లీలో హరీశ్ రావుకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్
Seethakka: తెలంగాణ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
Seethakka: అసెంబ్లీలో హరీశ్ రావుకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్
Seethakka: తెలంగాణ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిపై బురద చల్లడం సరికాదని ఆమె మండిపడ్డారు.
గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సీతక్క ఒక ఆసక్తికరమైన సామెతను ప్రస్తావించారు. "పాండవులు సంపాదించిన ఆస్తి అంతా కౌరవుల తద్దినానికే సరిపోయినట్లు.. ప్రస్తుతం మా ప్రభుత్వ పరిస్థితి ఉంది" అని ఆమె వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు, పాత బిల్లుల బకాయిలు చెల్లించేందుకే రాష్ట్ర ఆదాయం సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అప్పులకు వడ్డీలు, ఆ వడ్డీలకు వడ్డీలు కట్టడానికే మాకు సమయం సరిపోతోందని ఎద్దేవా చేశారు.
హరీశ్ రావు నియోజకవర్గంలో రైతు రుణమాఫీ కాలేదన్న విమర్శలకు సీతక్క సూటిగా సమాధానం ఇచ్చారు. "హరీష్ అన్న.. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు రుణమాఫీ చేయలేదు? అప్పుడే చేసి ఉంటే ఇప్పుడు మాకు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా" అని ప్రశ్నించారు.
ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత భీమా కల్పిస్తుంటే ఓర్వలేక రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మట్టి పోసే రాజకీయం మానుకోవాలని హితవు పలికారు.
"పదేళ్ల కాలం అంటే చాలా సమయం.. అప్పుడు ఏం చేశారో లెక్కలతో సహా చెప్పండి" అని సీతక్క సవాల్ విసిరారు. కేవలం అధికారం పోయిందన్న బాధతోనే హరీశ్ రావు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదని, తమ ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును బట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.




