Ugadi Celebrations: మట్టి పాత్రలతో ఉగాది స్పీకర్, మండలి చైర్మన్‌లకు మంత్రి పొన్నం ప్రత్యేక గిఫ్ట్!
Ugadi Celebrations: తెలంగాణ ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మట్టి పాత్రలను వాడండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి నినాదంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న ప్రచారం.
Ugadi Celebrations: మట్టి పాత్రలతో ఉగాది స్పీకర్, మండలి చైర్మన్‌లకు మంత్రి పొన్నం ప్రత్యేక గిఫ్ట్!
హైదరాబాద్: పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వేదికగా ప్రకృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మట్టి పాత్రల కిట్‌లను అందజేసిన మంత్రి పొన్నం:
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో "మట్టి పాత్రలను వాడండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి" అనే నినాదంతో ఈ ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలకు వారి ఛాంబర్లలో ఉగాది మట్టి పాత్రల కిట్‌లను మంత్రి అందజేశారు.
తరతరాల ఆరోగ్య రహస్యం - గుత్తా సుఖేందర్ రెడ్డి:
ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ.. మట్టి పాత్రల వాడకం వల్ల రోగాలు దరిచేరవని, ఇది మన పూర్వీకుల ఆరోగ్య రహస్యమని గుర్తుచేశారు. ప్రకృతిని, మన పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
కుల వృత్తులకు ప్రోత్సాహం - స్పీకర్ గడ్డం ప్రసాద్:
మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్న ఈ చొరవను స్పీకర్ అభినందించారు. ఈ ఉగాదిని ప్రతి ఒక్కరూ మట్టి పాత్రలతోనే జరుపుకోవాలని, తద్వారా పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, కుల వృత్తులను ప్రోత్సహించినట్లు అవుతుందని ఆయన పిలుపునిచ్చారు.




