Bangarupalli: బంగారుపల్లిలో చిరుత పులి సంచారం..ప్రాణభయంలో గ్రామస్తులు!

Bangarupalli: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బంగారుపల్లిలో చిరుత పులి వీరవిహారం చేస్తోంది. పశువుల పాకపై దాడి చేసి గేదెను చంపేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 March 2026 6:41 PM IST
Bangarupalli
X

Bangarupalli: బంగారుపల్లిలో చిరుత పులి సంచారం..ప్రాణభయంలో గ్రామస్తులు!

జుక్కల్ (కామారెడ్డి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో చిరుత పులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత రెండు నెలలుగా శివారు ప్రాంతాల్లో తిరుగుతూ మూగజీవాలను పొట్టన పెట్టుకుంటున్న చిరుత, తాజాగా బంగారుపల్లి గ్రామ శివారులో ఒక గేదెను వేటాడి చంపేసింది. ఈ ఘటనతో అటవీ ప్రాంత పరివాహక గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రెండు రోజుల క్రితమే కొన్న గేదె బలి

బాధిత రైతు కథనం ప్రకారం.. గురువారం గ్రామ శివారులోని పశువుల పాకలో కట్టేసి ఉన్న గేదెపై చిరుత దాడి చేసి చంపేసింది. కేవలం రెండు రోజుల క్రితమే వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన గేదె చిరుత దాడిలో మృత్యువాత పడటంతో సదరు రైతు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండు నెలల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఒక లేగదూడను చిరుత చంపి తిన్న విషయాన్ని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

బంగారుపల్లితో పాటు దోస్త్‌పల్లి, మేనూర్, సిద్ధాపూర్ తదితర ప్రాంతాల్లో చిరుత సంచారం ఎక్కువగా ఉన్నప్పటికీ, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రైతుల ఆవేదన: "ఘటన జరిగినప్పుడు వచ్చి చూసి వెళ్లడం తప్ప, చిరుతను పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మా నష్టాన్ని ఎవరు పూడుస్తారు?" అని రైతులు ప్రశ్నిస్తున్నారు. డిమాండ్: వెంటనే గ్రామ శివారుల్లో బోన్లను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

పశువుల కాపరులు, రైతులు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story