Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. తేల్చేసిన జీవన్ రెడ్డి..

Jeevan Reddy: తెలంగాణ మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 25న రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు .

KVD Varma
Published on: 22 March 2026 6:11 PM IST
Jeevan Reddy: తెలంగాణ మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
X

Jeevan Reddy

Jeevan Reddy: కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలో క్లారిటీ వచ్చేసింది. తనకు పార్టీలో అవమానం జరుగుతోందంటూ కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు జీవన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ వీడుతున్నారంటూ వార్తలు వెల్లువెత్తాయి. అయితే, వాటిపై ఎప్పుడూ ఆయన ప్రత్యక్షంగా మాట్లాడలేదు. అయితే, ఈరోజు ఆయన ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.

జగిత్యాల ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి ఆదివారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తానిక కాంగ్రెస్ లో కొనసాగలేనని స్పష్టం చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని జీవన్ రెడ్డి చెప్పారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి కారణంగా అన్యాయం జరిగిందాన్నరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండడం కంటే, బయటకు వెళ్లిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చానని ఆయన తెలిపారు. పార్టీలో ఉండాలనే ఆసక్తి చచ్చిపోయిందన్నారు.

ఈ న్ల 25న బండారి గార్డెన్స్ లో కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో సమావేశం నిర్వహిస్తామని జీవన్ రెడ్డి చెప్పారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ముందుగా అదేరోజు పార్టీఏకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో పాటు, ఏఐసీసీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేసారు. ప్రజలు, శ్రేయోభిలాషుల సలహాలు సూచనలు తీసుకుంటానని, వాటి ఆధారంగా ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనీ జీవం రెడ్డి వెల్లడించారు.

మొత్తంమీద చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో సాగుతూ వస్తున్న జీవన్ రెడ్డి వ్యవహారం ముగింపునకు వచ్చింది. ఇప్పుడు జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనేదానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.

నేపధ్యం ఇదీ . .

చాలాకాలంగా జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆయన కినుక వహించారు. ఆయన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడం విషయంలో జీవన్ రెడ్డి బాగా అప్ సెట్ అయ్యారు. ఈ విషయంలో అధిష్టానం కూడా తన మాట పట్టించుకోక పోవడంతో ఆయన ఆగ్రహించారు. దీంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల మున్సిపల్ ఎలక్షన్స్ లో జీవన్ రెడ్డి కి ప్రతిపాదించిన వారకి సీట్లు ఇవ్వకపోగా సంజయ్ వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వడంతో ఆయనను మరింత రెచ్చగొట్టినట్టయింది. దీంతో ఆయన తన అభ్యర్థులను స్వతంత్రులుగా బరిలోకి దించారు. ఎన్నికల్లో వారిలో ఎక్కువ శాతం మంది విజయం సాధించారు. అయినా, అధిష్టానం జీవన్ రెడ్డి విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా ఆయన కాంగ్రేస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరనున్నారని వదంతులు ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఆయనే స్వయంగా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని ప్రకటించడంతో.. ఇక బీఆర్ఎస్ లో చేరడమొక్కటే మిగిలిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

KVD Varma

KVD Varma

Next Story