Hyderabad Rains: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
Heavy Rains In Hyderabad: హైదరాబాద్ నగరాన్ని మంగళవారం సాయంత్రం వరుణుడు పలకరించాడు. భానుడి భగభగలతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం ఉపశమనాన్ని అందించినప్పటికీ, ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగించింది. పలు చోట్ల వడగళ్లు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
Hyderabad Rains: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్, సికింద్రాబాద్, అల్వాల్, జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. కొన్ని చోట్ల చిన్నపాటి వడగళ్లు పడ్డాయి. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై చీకటి కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
అధికారుల హై అలర్ట్..
నగరంలో వర్ష తీవ్రతను గమనించిన వాతావరణ శాఖ, మరో గంటపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు తక్షణమే అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షపు నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న 141 అత్యంత ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక బృందాలను మోహరించారు.
రోడ్లపై నిలిచిన నీరు.. వాహనదారుల ఇక్కట్లు..
సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం వల్ల రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి ఎక్కడికక్కడ నీటి నిల్వలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలకు సూచనలు..
విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాబోయే కొద్ది గంటల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉన్నందున చెట్ల కింద వాహనాలను నిలపవద్దని సూచించారు.




