Medchal: పెళ్లికి నో చెప్పిందని.. యువతికి HIV ఇంజక్షన్ ఇచ్చిన ఉన్మాది!

Medchal: మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 14 March 2026 4:43 PM IST
Medchal: పెళ్లికి నో చెప్పిందని.. యువతికి HIV ఇంజక్షన్ ఇచ్చిన ఉన్మాది!
X

Medchal: పెళ్లికి నో చెప్పిందని.. యువతికి HIV ఇంజక్షన్ ఇచ్చిన ఉన్మాది!

అన్నోజిగూడ: మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సినిమా తరహాలో పగ పెంచుకున్న ఒక యువకుడు, పెళ్లి నిరాకరించిందన్న కోపంతో యువతిపై అత్యంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. బాధితురాలికి బలవంతంగా హెచ్‌ఐవీ (HIV) సోకిన రక్తంతో ఇంజక్షన్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అసలేం జరిగింది?

అన్నోజిగూడకు చెందిన ఓ యువతికి ఆమె తండ్రి, తన బంధువైన మనోహర్‌తో వివాహం నిశ్చయించాడు. అయితే, మనోహర్ తల్లిదండ్రులు హెచ్‌ఐవీతో బాధపడుతున్నారని తెలుసుకున్న యువతి తండ్రికి అనుమానం వచ్చింది. దీంతో ఆరు నెలల క్రితం ఉప్పల్‌లోని ఒక ల్యాబ్‌లో మనోహర్‌కు పరీక్షలు నిర్వహించగా, అతనికి కూడా హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. దీంతో యువతి కుటుంబం ఈ పెళ్లిని రద్దు చేసుకుంది.

పగతో రగిలిపోయిన మనోహర్

తనకు వ్యాధి ఉందన్న కారణంతో పెళ్లి క్యాన్సిల్ చేయడాన్ని మనోహర్ జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ఆ యువతిని దెబ్బతీయాలని కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 11న యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోపలికి ప్రవేశించాడు. ఆమెను బెదిరించి, బలవంతంగా తన శరీరం నుండి తీసిన హెచ్‌ఐవీ రక్తంతో కూడిన ఇంజక్షన్‌ను ఆమెకు ఇచ్చాడు.

ఆస్పత్రిలో బాధితురాలు.. నిందితుడు అరెస్ట్

ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే యువతికి తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఉప్పల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాధితురాలు జరిగిన దారుణాన్ని వివరించడంతో బంధువులు షాక్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story