Harish Rao: ఆదివారం కూడా సభ పెట్టండి.. చర్చకు మేం రెడీ: హరీష్ రావు సవాల్

Harish Rao: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 16 March 2026 4:04 PM IST
Harish Rao: ఆదివారం కూడా సభ పెట్టండి.. చర్చకు మేం రెడీ: హరీష్ రావు సవాల్
X

Harish Rao: ఆదివారం కూడా సభ పెట్టండి.. చర్చకు మేం రెడీ: హరీష్ రావు సవాల్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన చిట్‌చాట్ చేస్తూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు.

సెలవులకే సరిపోతుంది.. సభ ఎప్పుడు నడుస్తుంది?

ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇందులో మూడు పండుగలు, రెండు ఆదివారాలు ఉన్నాయని హరీష్ రావు గుర్తు చేశారు. "ఐదు రోజులు సెలవులకే పోతే, సభ ఐదారు రోజులు కూడా నడవని పరిస్థితి ఉంది. అందుకే ఈ నెల 31 వరకు అసెంబ్లీని పొడిగించాలని డిమాండ్ చేశాం. అవసరమైతే ఆదివారం కూడా సభ పెట్టండి.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని స్పష్టం చేశారు.

19 అంశాలపై చర్చ జరగాల్సిందే!

బీఆర్‌ఎస్ తరపున సభలో చర్చించాల్సిన 19 కీలక అంశాలను ప్రభుత్వానికి అందజేశామని హరీష్ రావు వెల్లడించారు. వీటితో పాటు ఆయన మరికొన్ని ప్రధాన డిమాండ్లు లేవనెత్తారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన అంశాలపై హౌస్ కమిటీలు వేయాలని, చర్చ సమయంలో మంత్రులు అడ్డుతగలకూడదని కోరారు. అసెంబ్లీని ఉదయం 9 గంటలకే ప్రారంభించాలని, పాయింట్ ఆఫ్ ఆర్డర్ మరియు నిరసన తెలపడానికి తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. అసెంబ్లీలోని లైబ్రరీని ఆధునీకరించి, బాగు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై అసంతృప్తి

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు ఆహ్వానం అందకపోవడంపై హరీష్ రావు స్పందించారు. "విగ్రహావిష్కరణకు మాకు కనీసం ఆహ్వానం కూడా ఇవ్వలేదు.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story