Tandur: దివ్యాంగుల డిమాండ్: ఏపీలో అమలైంది.. మాకెప్పుడు?
Tandur: వికారాబాద్ జిల్లా తాండూరులో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు దివ్యాంగుల పాలాభిషేకం.
Tandur: దివ్యాంగుల డిమాండ్: ఏపీలో అమలైంది.. మాకెప్పుడు?
తాండూరు (వికారాబాద్ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఆదివారం తాండూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం నేతలు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది పండుగను పురస్కరించుకుని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు, ఆసరా పెన్షన్ను 6 వేల రూపాయలకు పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. మానవత్వంతో ఈ నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం:
ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, ఏపీ తరహాలో తెలంగాణలోనూ దివ్యాంగులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తాండూరు సీనియర్ నాయకులు చందు, గజేలప్ప, రాజాసింగ్, నర్సిములు, మొగులప్ప మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




