Cyberabad: ఇంటి వద్దకే వచ్చి పిల్లలను పికప్ చేస్తారు.. సైబరాబాద్ పోలీసుల 'డోర్-స్టెప్' స్కూల్ సర్వీస్!
Cyberabad: సాఫ్ట్‌వేర్ హబ్ సైబరాబాద్ పరిధిలో స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎదురవుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త అడుగు వేశారు.
Cyberabad: ఇంటి వద్దకే వచ్చి పిల్లలను పికప్ చేస్తారు.. సైబరాబాద్ పోలీసుల 'డోర్-స్టెప్' స్కూల్ సర్వీస్!
Cyberabad: సాఫ్ట్‌వేర్ హబ్ సైబరాబాద్ పరిధిలో స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎదురవుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త అడుగు వేశారు. పిల్లలను సురక్షితంగా స్కూలుకు చేరవేయడంతో పాటు, రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా 'స్మార్ట్ స్కూల్ ట్రాన్స్‌పోర్ట్' విధానాన్ని రూపొందించారు. 2026 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇంటి వద్దకే వచ్చి పికప్ (Door-Step Pickup)
ఈ పథకం కింద పోలీసులు వెరిఫైడ్ 'మొబిలిటీ అటెండెంట్లను' నియమిస్తారు. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, మున్సిపల్ స్వీపర్ల వంటి వారిని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత ఈ బాధ్యతల్లోకి తీసుకుంటారు. వీరు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి పిల్లలను పికప్ చేసుకుని సురక్షితంగా స్కూల్ బస్సు ఎక్కిస్తారు. బస్సు దిగిన తర్వాత తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుస్తారు. దీనివల్ల తల్లిదండ్రులు ఆఫీసు పనుల మధ్యలో పిల్లల కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం తప్పుతుంది.
టెక్నాలజీతో పక్కా నిఘా
పిల్లల భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతను జోడించనున్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తల్లిదండ్రులు బస్సు ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ప్రతి బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని సైబరాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. ఒకే ప్రాంతంలోని వివిధ స్కూళ్ల విద్యార్థుల కోసం కామన్ రూట్లను మ్యాపింగ్ చేస్తారు.
30 శాతం తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ
ప్రస్తుతం సైబరాబాద్‌లో 1,539 స్కూళ్లకు కేవలం 3 వేల బస్సులు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల మెజారిటీ తల్లిదండ్రులు సొంత వాహనాల్లో పిల్లలను వదిలిపెడుతున్నారు. ఫలితంగా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రస్తుతమున్న 3 వేల బస్సులను 15 వేలకు పెంచాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల రోడ్లపై వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గి, ట్రాఫిక్ రద్దీ 30 శాతం వరకు తగ్గుతుందని అంచనా.
సబ్‌స్క్రిప్షన్ విధానం
ఈ సేవల కోసం తల్లిదండ్రులు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దూరాన్ని బట్టి ఫీజు నిర్ణయిస్తారు. మూడు నెలలకు లేదా వార్షిక ప్రాతిపదికన యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. జూన్ 2026 నుండి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు పోలీసులు స్కూల్ యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు.




