పరిగిలో రాజకీయం చేస్తున్న చెత్త.. అధికారుల వివక్షపై కౌన్సిలర్ల యుద్ధం!
అధికారుల వివక్షను నిరసిస్తూ బిఆర్ఎస్ కౌన్సిలర్లు మేడిగడ్డ శ్రీనివాస్, నరేష్‌లు స్వయంగా టాటా ఏసీ నడుపుతూ ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించారు
పరిగిలో రాజకీయం చేస్తున్న చెత్త.. అధికారుల వివక్షపై కౌన్సిలర్ల యుద్ధం!
Pargi: పరిగి మున్సిపాలిటీలో అధికార, ప్రతిపక్షాల మధ్య చెత్త రాజకీయం ముదిరింది. 18వ వార్డులో గత కొద్దిరోజులుగా చెత్తాసేకరణ నిలిచిపోవడంతో.. ప్రజాప్రతినిధులే నేరుగా రోడ్డుపైకి వచ్చారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కావాలనే అధికారులు వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ.. 15వ వార్డు కౌన్సిలర్ మేడిగడ్డ శ్రీనివాస్, 18వ వార్డు కౌన్సిలర్ నరేష్‌లు వినూత్న నిరసనకు దిగారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వారు చేస్తున్న ఈ పని ఇప్పుడు పట్టణంలో సంచలనంగా మారింది.
పరిగి మున్సిపాలిటీలోని 18వ వార్డు ప్రజలు చెత్త కుప్పల మధ్య జీవించాల్సి వస్తోంది. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా, వినతులు ఇచ్చినా 'చెత్త బండి' మాత్రం వార్డు ముఖం చూడటం లేదు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని వార్డు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
తాము బిఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన కౌన్సిలర్లం కావడంతోనే.. అధికారులు కావాలనే తమ వార్డులను పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.
అధికారుల మొండివైఖరిని ఎండగట్టేందుకు 18వ వార్డు కౌన్సిలర్ నరేష్, 15వ వార్డు కౌన్సిలర్ మేడిగడ్డ శ్రీనివాస్ ఒక వింత నిరసనకు దిగారు. ఏకంగా ఒక టాటా ఏసీ వాహనాన్ని సమకూర్చుకుని.. 15వ వార్డు కౌన్సిలర్ మేడిగడ్డ శ్రీనివాస్ స్వయంగా స్టీరింగ్ పట్టి బండి నడుపుతుంటే, 18వ వార్డు కౌన్సిలర్ నరేష్ మైక్ పట్టుకొని ప్రజలను చైతన్యపరుస్తూ ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు.
"అధికారులు వివక్ష చూపినా.. మా ప్రజల కోసం మేము పారిశుధ్య కార్మికులుగా మారడానికి సిద్ధం" అంటూ వారు గర్జిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న చెత్తను స్వయంగా బండిలోకి ఎత్తుతూ, అధికారుల తీరును ప్రజల ముందు ఎండగడుతున్నారు.
బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డులకు నిధులు, సౌకర్యాల కల్పనలో అధికారులు వెనకాడుతున్నారు.పారిశుధ్యంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని మున్సిపల్ కమిషనర్.ఇప్పటికైనా వివక్ష వీడకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.వార్డు సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులే కార్మికులుగా మారి రోడ్డుపైకి రావడం అధికారుల పనితీరుకు నిలువుటద్దంలా కనిపిస్తోంది. మరి ఈ వినూత్న నిరసనతోనైనా అధికారుల్లో మార్పు వస్తుందా? లేక ఈ రాజకీయ చదరంగంలో ప్రజలు మరిన్ని రోజులు చెత్తలోనే కాలం వెళ్లదీయాలా అనేది వేచి చూడాలి.




