నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య
ఇందల్వాయి (నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి (45) దారుణ హత్యకు గురయ్యారు.
నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య
ఇందల్వాయి (నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి (45) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి తన స్వగ్రామమైన లింగాపూర్ వెళ్తుండగా, గ్రామ శివారులో దుండగులు పక్కా ప్లాన్‌తో ఆయనను అంతమొందించారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇమ్మడి గోపి రాత్రి తన కారులో ఇంటికి వెళ్తుండగా, నిందితులు మరో వాహనంతో అడ్డుకుని బలంగా ఢీకొట్టారు. కారు అదుపుతప్పిన వెంటనే, నిందితులు బయటకు వచ్చి గోపిపై వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన మేనల్లుడు
హత్య జరిగిన కొద్దిసేపటికే నిందితుడు ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయాడు. నిందితుడిని గోపికి వరుసకు మేనల్లుడైన సమీప బంధువుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలు లేదా ఆస్తి తగాదాలే ఈ హత్యకు దారితీశాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
రాజకీయాల్లో కీలక నేత
ఇమ్మడి గోపి ఇందల్వాయి మండల రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో ఇందల్వాయి ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య హేమలత ఇటీవలే గౌరారం సర్పంచిగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో కీలక నేతగా ఉన్న గోపి హత్యకు గురవ్వడంతో మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భారీ ఎత్తున పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.




