Bandi Sanjay: ఆరు గ్యారంటీలకు పాడె కట్టారు.. అప్పుల కోసం అర్రులు చాచే బడ్జెట్

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 20 March 2026 5:44 PM IST
Bandi Sanjay
X

Bandi Sanjay: ఆరు గ్యారంటీలకు పాడె కట్టారు.. అప్పుల కోసం అర్రులు చాచే బడ్జెట్

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఈ బడ్జెట్ ప్రజలను వంచించేలా ఉందని, కేవలం అంకెల గారడీతో ప్రజలను దగా చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టిందని ఎద్దేవా చేశారు.

బండి సంజయ్ చేసిన ప్రధాన విమర్శలు:

"ఆదాయం పెంచుకోవడం చేతకాక, అప్పుల కోసం అర్రులు చాచే బడ్జెట్ ఇది. మరో రూ. లక్ష కోట్లు అదనంగా అప్పు భారం మోపాలని చూడటం సిగ్గుచేటు. రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారు" అని మండిపడ్డారు.

ఎన్నికల హామీలైన తులం బంగారం తుస్ అనిపించారని, మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 ఊసే లేదని ధ్వజమెత్తారు. రైతు భరోసా పైసలు ఎగ్గొట్టారని, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు.

బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి అంశమే లేదని, విద్యార్థులకు ఇస్తామన్న రూ. 5 లక్షల భరోసా కార్డుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు.

విద్యాశాఖకు 16 శాతం నిధులు ఇవ్వాలని కమిషన్ చెబితే, కేవలం 8 శాతానికే పరిమితం చేశారన్నారు. ఆరోగ్యశ్రీకి పాత బకాయిల కంటే తక్కువ కేటాయింపులు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

56 శాతం ఉన్న బీసీలకు కేవలం 4 శాతం నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ ప్రస్తావనే లేదని, పుష్కరాలకు కంటితుడుపు కేటాయింపులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దావోస్, గ్లోబల్ సమ్మిట్ పేరుతో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక మంత్రి చెప్పడం అబద్ధమని, ఆ వివరాలు వెల్లడించే దమ్ముందా అని సవాల్ విసిరారు.

బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పుల భాగోతంపై విచారణ జరిపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story