Bandi Sanjay: కొండగట్టు యాత్రలో కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుండి కొండగట్టుకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరియు బ్రాహ్మణులపై వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యేపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay: "వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే.." కొండగట్టు యాత్రలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
Bandi Sanjay Kondagattu Padayatra: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుండి కొండగట్టు అంజన్న క్షేత్రం వరకు తన పాదయాత్రను ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు మొక్కు తీర్చుకోవడంలో భాగంగా ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు తుంగతుర్తి ఎమ్మెల్యేపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మొక్కు తీర్చుకునేందుకే పాదయాత్ర
దేశ సేవ, ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో ఎంపీగా గెలిచినప్పుడు కూడా పాదయాత్ర చేశానని గుర్తు చేస్తూ, ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యాత్రను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ అండదండలతో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఏపీలో లాగే తెలంగాణలో కూడా త్వరలో 'డబుల్ ఇంజన్' సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తీరుపై విమర్శలు
కొండగట్టు అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సంజయ్ విమర్శించారు. "కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం కూడా కేంద్రం ప్రసాద్ (PRASHAD) స్కీమ్ కింద అభివృద్ధి చేస్తానన్నా సహకరించలేదు" అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎంతో అంటకాగుతూ ముస్లిం పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం
బ్రాహ్మణులపై తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని, దీనిపై కాంగ్రెస్ నేతలు చప్పట్లు కొట్టడం సిగ్గుచేటని సంజయ్ అన్నారు. "నువ్వు బీసీవా, ఎస్సీవా లేక క్రిస్టియన్ వా? ముందు అది తేల్చుకో. నిజమైన క్రిస్టియన్లు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. బ్రాహ్మణులను కించపరిచినందుకు సీఎం, కాంగ్రెస్ పార్టీ తక్షణమే క్షమాపణలు చెప్పాలి" అని డిమాండ్ చేశారు. సదరు ఎమ్మెల్యేను ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా బహిష్కరించాలని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఎలా గెలుస్తాడో చూస్తామని బండి సంజయ్ సవాల్ విసిరారు.




