Karimnagar ABVP: బడ్జెట్ ప్రతుల దహనం: కరీంనగర్‌లో ABVP నిరసన!
Karimnagar ABVP: తెలంగాణ బడ్జెట్ 2026-27 విద్యారంగాన్ని విస్మరించిందని ABVP కరీంనగర్‌లో నిరసన చేపట్టింది.
Karimnagar ABVP: బడ్జెట్ ప్రతుల దహనం: కరీంనగర్‌లో ABVP నిరసన!
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ విద్యార్థి లోకాన్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని ABVP ఆరోపించింది. విద్యారంగానికి కేవలం 8 శాతం నిధులు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శిస్తూ, శనివారం కరీంనగర్ గీత భవన్ చౌరస్తా వద్ద ABVP నాయకులు బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్ బకాయిలపై స్పష్టత కరువు:
ఈ సందర్భంగా ABVP జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ.. రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. వేల కోట్లు బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలపై బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. బకాయిలు చెల్లించకపోతే పేద విద్యార్థుల చదువులు ఆగిపోయే ప్రమాదం ఉందని, అసలు ఈ పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అని ఆయన ప్రశ్నించారు.
నిరుద్యోగులను వంచించిన 'జాబ్ క్యాలెండర్' విస్మరణ:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు బడ్జెట్‌లో దాని ఊసే ఎత్తకపోవడం నిరుద్యోగులను వంచించడమేనని విష్ణు ధ్వజమెత్తారు. ఉస్మానియా, చాకలి ఐలమ్మ యూనివర్సిటీలకు నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే గ్రామీణ ప్రాంతాల్లోని యూనివర్సిటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. వర్సిటీల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి హెచ్చరిక:
వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామక ప్రక్రియ మొదలుపెట్టాలని ABVP డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని, విద్యార్థి లోకం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉపేక్షించదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విగ్నేష్, విష్ణు, నాగరాజ్, వంశీ, కిషోర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.




