Karimnagar: వరుస స్ట్రోక్స్, మరణాలు.. గండ్రపల్లిలో ఏం జరుగుతోంది?
Karimnagar: జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వరుస మరణాలు సంభవిస్తుండటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Karimnagar: వరుస స్ట్రోక్స్, మరణాలు.. గండ్రపల్లిలో ఏం జరుగుతోంది?
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా): జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వరుస మరణాలు సంభవిస్తుండటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమ గ్రామానికి ఏదో 'కీడు' సోకిందని నమ్మిన ప్రజలంతా ఆదివారం ఉదయం ఊరు విడిచి శివార్లకు చేరుకుని 'కీడు వంటలు' చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
వరుస మరణాలతో వణుకు:
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు నెలల కాలంలోనే గ్రామంలో సుమారు 25 మంది మృతి చెందారు. ఒకరి దశదిన కర్మలు పూర్తి కాకముందే మరొకరు మరణిస్తుండటం, మరికొందరు ఆకస్మిక స్ట్రోక్స్ (పక్షవాతం) మరియు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతుండటంతో గ్రామంలో మరణ భయం పట్టుకుంది. ఈ వరుస మరణాల వెనుక ఏదో అదృశ్య శక్తి లేదా కీడు ఉందని గ్రామస్థులు బలంగా నమ్ముతున్నారు.
పండితుల సూచనతో 'కీడు వంటలు':
ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు గ్రామ పెద్దలు పండితులను సంప్రదించగా, ఊరికి సోకిన కీడు వదిలించుకోవడానికి అందరూ కలిసి ఊరు విడిచి వెళ్లాలని సూచించారు. దీంతో ఆదివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గ్రామమంతా ఖాళీ చేసి, ఊరి బయట వంటలు చేసుకుని గడుపుతున్నారు. దీనివల్ల గ్రామంలో ఉన్న దోషాలు తొలగిపోయి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని గ్రామస్థులు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం గండ్రపల్లి గ్రామం జనసంచారం లేక వెలవెలబోతుండగా, గ్రామ శివార్లన్నీ వంటలతో సందడిగా మారాయి. ఈ ఘటనపై అధికారులు స్పందించి, మరణాల వెనుక ఉన్న అసలు కారణాలు (వైద్యపరమైనవి ఏమైనా ఉన్నాయా?) గుర్తించాలని కొందరు కోరుతున్నారు.




