Spam Call: సైబర్ మోసాలకు చెక్ పెట్టిండి ఇలా.. ట్రూకాలర్ కొత్త ఫీచర్ ట్రై చేశారా..?
Cyber Fraud Prevention App: సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో కొత్త రక్షణ ఫీచర్‌ను ట్రూకాలర్ తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు వేరే నగరంలో ఉన్నా మీ కుటుంబ సభ్యులకు వచ్చే అనుమానాస్పద కాల్స్‌ను ముందుగానే గుర్తించి కట్ చేయవచ్చు. దీంతో పిల్లలు, వృద్ధులు స్కామ్ కాల్స్ నుంచి మరింత సురక్షితంగా ఉంటారు.
Spam Call: సైబర్ మోసాలకు చెక్ పెట్టిండి ఇలా.. ట్రూకాలర్ కొత్త ఫీచర్ ట్రై చేశారా..?
Spam Call Alert: ఇటీవల కాలంలో సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫోన్ కాల్స్ ద్వారా మోసగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బ్యాంక్ KYC అప్డేట్, డిజిటల్ అరెస్ట్, లాటరీ గెలిచారంటూ ఇలా చాలా మందిని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇలాంటి స్కామ్ కాల్స్‌కు సులభంగా బలవుతున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రముఖ కాలర్ ఐడీ యాప్ ట్రూ కాలర్ (Truecaller) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కుటుంబ సభ్యులను రక్షించేందుకు కొత్త ఫీచర్..
ట్రూ కాలర్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో మీరు ఎక్కడ ఉన్నా మీ కుటుంబ సభ్యులకు వచ్చే అనుమానాస్పద కాల్స్‌పై నియంత్రణ కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు మీరు వేరే నగరంలో పని చేస్తున్నా, ఇంట్లో ఉన్న పిల్లలు లేదా తల్లిదండ్రులకు వచ్చే స్కామ్ కాల్స్ గురించి వెంటనే సమాచారం అందుతుంది. అంటే మోసగాళ్లు మీ కుటుంబ సభ్యులను సంప్రదించే ముందు మీకు అలర్ట్ వచ్చే విధంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
ట్రూ కాలర్ కొత్త అప్డేట్ ప్రకారం ఒక కుటుంబ సభ్యుడు గ్రూప్ అడ్మిన్‌గా ఉండవచ్చు. ఈ గ్రూప్‌లో మొత్తం ఐదుగురు సభ్యులను చేర్చుకోవచ్చు. వారిలో ఎవరికైనా అనుమానాస్పద కాల్ వస్తే అడ్మిన్‌కు వెంటనే అలర్ట్ వస్తుంది. అడ్మిన్ ఆ కాల్ ప్రమాదకరమని భావిస్తే తన ఫోన్ నుంచే ఆ కాల్‌ను కట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ కాల్ కట్ చేసే ఫీచర్ ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా విడుదల..
ఈ ఫీచర్‌ను మొదటగా స్వీడన్, చిలీ, మలేషియా, కెన్యా వంటి దేశాల్లో గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభించారు. మొదటి దశలో మంచి స్పందన రావడంతో ఇప్పుడు దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.
ప్రైవసీకి ప్రాధాన్యం..
ట్రూకాలర్ కంపెనీ ప్రకారం ఈ ఫీచర్లో భద్రతతో పాటు వినియోగదారుల గోప్యతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. గ్రూప్ అడ్మిన్‌కు కేవలం స్పామ్ కాల్ అలర్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల వ్యక్తిగత కాల్ హిస్టరీ లేదా ఎస్ఎంఎస్ (SMS)లకు అడ్మిన్‌కు యాక్సెస్ ఉండదు.
ఏఐతో మరింత భద్రత..
భవిష్యత్తులో ట్రూకాలర్ ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించాలని యోచిస్తోంది. AI సిస్టమ్ “డిజిటల్ అరెస్ట్”, “బ్యాంక్ KYC” వంటి కీలక పదాలను గుర్తించి స్కామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే విధంగా అభివృద్ధి చేయనుంది.




