
మీ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా.. వెంటనే తొలగించండి.. లేదంటే ప్రమాదంలో పడ్డట్లే..?
Android Malware: ప్రస్తుతం ఆండ్రాయిడ్ వాడుతున్న యూజర్లకు భారీ ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి యాప్ లు వాడుతుంటే ప్రమాదంలో పడ్డట్లే. అవేంటో ఓసారి చూద్దాం..
Android Malware: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకం ఎంత పెరిగిందో, సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన 'ఆపరేషన్ నోవాయిస్' అనే భారీ కుట్ర ద్వారా హ్యాకర్లు లక్షలాది మంది ఫోన్లపై పంజా విసిరారు. గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని ప్రమాదకరమైన యాప్‌ల ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తూ, బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్నారు.
ప్రముఖ సైబర్ భద్రతా సంస్థ మాకాఫీ (McAfee) పరిశోధకులు ఆండ్రాయిడ్ వినియోగదారులను వణికించే ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న సుమారు 50కి పైగా ప్రమాదకరమైన యాప్‌లను గుర్తించింది. ఇవి కేవలం సాధారణ యాప్‌లు మాత్రమే కాదు, వినియోగదారుల ఫోన్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే మాల్వేర్లని తేలింది. ఈ యాప్‌లను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం. ఫోన్ క్లీనర్లు, పజిల్ గేమ్‌లు, ఫోటో ఎడిటింగ్ యాప్‌ల రూపంలో ఇవి మన ఫోన్లలోకి చొరబడుతున్నాయి.
'ఆపరేషన్ నోవాయిస్' అంటే ఏమిటి?
ఈ సైబర్ దాడికి హ్యాకర్లు 'ఆపరేషన్ నోవాయిస్' అని పేరు పెట్టారు. ఇవి చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ లోపల 'రూట్‌కిట్' (Rootkit) అనే అత్యంత శక్తివంతమైన వైరస్‌ను కలిగి ఉంటాయి. మీరు ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసినప్పుడు, అవి పైకి పని చేస్తున్నట్లే కనిపిస్తాయి కానీ, వెనుక నుంచి మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ వివరాలు, సెక్యూరిటీ అప్‌డేట్లు, ఇతర రహస్య సమాచారాన్ని హ్యాకర్ల సర్వర్‌లకు చేరవేస్తాయి.
మీ ఫోన్ పై హ్యాకర్ల పెత్తనం..
ఒకసారి మీ ఫోన్ వివరాలు హ్యాకర్లకు చిక్కగానే, వారు రిమోట్ ద్వారా ప్రత్యేక కోడ్‌లను పంపుతారు. దీనివల్ల మీ ఫోన్ పైన మీకు కన్నా హ్యాకర్లకే ఎక్కువ నియంత్రణ లభిస్తుంది. దీనిని 'రూట్ యాక్సెస్' అంటారు. అంటే, మీ ప్రమేయం లేకుండానే మీ ఫోన్లో ఫైళ్లను మార్చడం, కెమెరాను ఆన్ చేయడం లేదా మీ బ్యాంకింగ్ యాప్‌ల నుంచి నగదును మళ్లించడం వంటివి అకస్మాత్తుగా జరిగిపోతుంటాయి. ఈ వైరస్ ఎంత ప్రమాదకరమంటే, మీరు ఫోన్‌ను సాధారణంగా 'ఫ్యాక్టరీ రీసెట్' చేసినా ఇది తొలగిపోదు. దీనిని వదిలించుకోవాలంటే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా మళ్లీ వేయించాల్సి ఉంటుంది.
ఎవరికి ముప్పు ఎక్కువగా ఉంది?
పాత ఆండ్రాయిడ్ వెర్షన్లు వాడుతున్న వారు, భద్రతా అప్‌డేట్లు (Security Updates) చేసుకోని ఫోన్లకు ఈ ముప్పు చాలా ఎక్కువగా ఉంది. కొత్త ఫోన్లలో కొంతవరకు రక్షణ ఉన్నప్పటికీ, ఈ 50 యాప్‌లలో ఏదైనా ఒకటి మీ ఫోన్లో ఉంటే ప్రమాదం తప్పదు.
సురక్షితంగా ఉండటం ఎలా?
మీ ఫోన్లోని యాప్‌ల జాబితాను నిశితంగా పరిశీలించండి. మీకు తెలియని లేదా అనవసరమైన యాప్‌లు ఉంటే వెంటనే తొలగించండి.
ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి.
ప్లే స్టోర్‌లో ఉన్న ప్రతి యాప్‌ను గుడ్డిగా నమ్మకండి. డౌన్‌లోడ్ చేసే ముందు రివ్యూలను తప్పక చదవండి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire


