CIBILScore: క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా? అయినా సరే రుణం ఎలా పొందవచ్చో చూసేయండి!

మీ సిబిల్ (CIBIL) స్కోరు తక్కువగా ఉందా? రుణం దొరకదని ఆందోళన చెందుతున్నారా? క్రెడిట్ స్కోరుతో సంబంధం లేకుండా బంగారం, ఎల్ఐసీ పాలసీ మరియు ఆస్తిపై సులభంగా రుణం పొందే 6 అద్భుతమైన మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.

Ganesh
Published on: 16 March 2026 2:01 PM IST
CIBILScore: క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా? అయినా సరే రుణం ఎలా పొందవచ్చో చూసేయండి!
X

CIBILScore: క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా? అయినా సరే రుణం ఎలా పొందవచ్చో చూసేయండి!

CIBILScore: ఈ రోజుల్లో బ్యాంకు అప్పులు తీసుకోవాలంటే.. క్రెడిట్ స్కోరు చాలా కీలకంగా మారుతుంది. సాధారణంగా ఏదైనా బ్యాంకులో రుణం తీసుకోవాలంటే 'క్రెడిట్ స్కోరు' అత్యంత కీలకం అయిన విషయం తెలసిందే. ఒకవేళ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నా లేదా అసలు క్రెడిట్ చరిత్ర లేకపోయినా.. ఆర్థిక అవసరాల కోసం దారులు మూసుకుపోయినట్లే అనుకుంటారు చాలా మంది. కానీ సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా తక్షణమే రుణాలు పొందేందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. గోల్డ్ లోన్ (బంగారు ఆభరణాలపై):

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రుణ మార్గమిది. మీ వద్ద ఉన్న బంగారాన్ని పూచీకత్తుగా ఉంచి బ్యాంకులు లేదా NBFCల నుంచి నిమిషాల్లో రుణం పొందవచ్చు. ఈ లోన్‌కు ఎలాంటి క్రెడిట్ స్కోరుతో సంబంధం లేదు. కేవలం బంగారం విలువను బట్టి రుణం ఇస్తారు. వడ్డీ రేట్లు కూడా 8.50% నుంచి ప్రారంభమవుతాయి.

2. హామీదారుడి (Guarantor) సాయంతో:

మీ క్రెడిట్ ప్రొఫైల్ బలహీనంగా ఉన్నప్పుడు, మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న మీ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను హామీదారుగా (గ్యారెంటీగా) చూపించి రుణం పొందవచ్చు. హామీదారుడి ఆర్థిక పరిస్థితి, స్కోరు బాగుంటే బ్యాంకులు మీకు పర్సనల్ లేదా ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేస్తాయి.

3. ఎల్ఐసీ (LIC) పాలసీపై రుణం:

సరెండర్ విలువ కలిగిన జీవిత బీమా పాలసీలు ఉంటే, వాటిపై కూడా తక్షణ రుణం పొందవచ్చు. కనీసం మూడు ఏళ్లపాటు ప్రీమియం చెల్లించిన పాలసీలపై క్రెడిట్ స్కోరు ప్రమేయం లేకుండా 9-10% వడ్డీకే రుణం లభిస్తుంది.

4. ఆస్తిపై రుణం:

మీకు సొంతంగా ఇల్లు లేదా వాణిజ్య స్థలం ఉంటే, దానిని తాకట్టు పెట్టి భారీ మొత్తంలో రుణం పొందవచ్చు. ఇది ముఖ్యంగా స్వయం ఉపాధి పొందే వారికి మంచి ఎంపిక. దీనిపై వడ్డీ రేట్లు 9-12% వరకు ఉంటాయి. తిరిగి చెల్లించడానికి కూడా సుదీర్ఘ కాలపరిమితి లభిస్తుంది.

5. అద్దె డిపాజిట్ రుణాలు:

మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లకు భారీగా డిపాజిట్ చెల్లించాల్సి వస్తుంది. అప్పటికప్పుడు అంత నగదు లేని వారి కోసం బజాజ్ ఫిన్‌సర్వ్, కాషే (CASHe) వంటి సంస్థలు ప్రత్యేక రుణాలను అందిస్తున్నాయి. ఈ సంస్థలు నేరుగా ఇంటి యజమానికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లిస్తాయి. దీనిపై వడ్డీ 10-24% వరకు ఉండవచ్చు.

6. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం:

బ్యాంకుతో మీకు మంచి సంబంధాలు ఉన్నప్పుడు, మీ పొదుపు ఖాతాలోని బ్యాలెన్స్ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకునేలా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇది ఒక రకమైన 'ప్రీ-అప్రూవ్డ్' క్రెడిట్. దీనికి ప్రత్యేకంగా క్రెడిట్ స్కోరు అవసరం లేదు. వడ్డీ రేట్లు 9-12% వరకు ఉంటాయి.

ఆర్థిక అత్యవసర సమయాల్లో సిబిల్ స్కోరు లేదని ఆందోళన చెందకుండా, పైన పేర్కొన్న మార్గాలను పరిశీలిస్తే సులభంగా నిధులు సమకూర్చుకోవచ్చు. అయితే, వడ్డీ రేట్లు, షరతులను క్షుణ్ణంగా చదివిన తర్వాతే ఆ వైపుగా ముందడుగు వేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Ganesh

Ganesh

Next Story