Future Gadgets: ఫ్యూచర్ చెప్పే మిర్రర్ నుంచి ఏఐ ఫ్రెండ్ వరకు.. ఈ 7 ఫ్యూచర్ గాడ్జెట్స్ చూస్తే బుర్ర కరాబే..

Consumer Electronics Show 2026: టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద ఈవెంట్‌లలో ఒకటిగా పేరుగాంచిన CES 2026లో ఎన్నో కొత్త AI గాడ్జెట్లు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆరోగ్యం, జ్ఞాపకాలు, మెదడు కార్యకలాపాలు, ఒంటరితనం వంటి మనిషి జీవితానికి దగ్గరగా ఉండే అంశాలపై రూపొందించిన ఈ గ్యాడ్జెట్స్ ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉండబోతుందో చూపిస్తున్నాయి.

Venkat
Published on: 13 March 2026 7:20 PM IST
Future Gadgets
X

Future Gadgets: ఫ్యూచర్ చెప్పే మిర్రర్ నుంచి ఏఐ ఫ్రెండ్ వరకు.. ఈ 7 ఫ్యూచర్ గాడ్జెట్స్ చూస్తే బుర్ర కరాబే..  

Future Gadgets: కాలం మారుతోంది. అందుకు తగ్గట్లుగానే టెక్నాలజీ కూడా మారుతోంది. దీంతో కొత్త కొత్త గ్యాడ్జెట్స్ మార్కెట్లు వస్తున్నాయి. తాజాగా ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ షో Consumer Electronics Show 2026 (CES 2026)లో ఎన్నో AI ఆధారిత గాడ్జెట్లు ప్రదర్శించారు. ఈ గ్యాడ్జెట్స్ మతిపోగొడుతున్నాయి.

ఇవి కేవలం కంప్యూటర్లు లేదా ఆఫీస్ పనులకు సంబంధించినవి మాత్రమే కాకుండా మన రోజువారీ జీవితానికి మరింత దగ్గరగా ఉండే విధంగా రూపొందించారు. బాత్రూమ్ నుంచి బెడ్‌రూమ్ వరకు, మన మెదడు నుంచి జ్ఞాపకాల వరకు అనేక అంశాలను ట్రాక్ చేసే టెక్నాలజీలు ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఆరోగ్యాన్ని చెప్పే ‘స్మార్ట్ మిరర్’..

కెనడాకు చెందిన NuraLogix రూపొందించిన “Longevity Mirror” ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణ అద్దంలా కనిపించే ఈ పరికరం 30 సెకన్లలోనే ముఖంలోని రక్తప్రవాహాన్ని స్కాన్ చేసి ఆరోగ్య స్థితిని విశ్లేషిస్తుంది. AI సాయంతో “Longevity Index” రూపొందించి గుండె ఆరోగ్యం, మెటాబాలిజం, ఒత్తిడి స్థాయి వంటి అంశాలపై సమాచారం ఇస్తుంది. దీని ధర సుమారు 900 డాలర్లు.

బ్రెయిన్ ను ట్రాక్ చేసే హెడ్‌సెట్..

Neurable, HyperX కలిసి రూపొందించిన ప్రత్యేక హెడ్‌సెట్‌లో EEG సెన్సర్లు ఉంటాయి. ఈ పరికరం మెదడులో జరిగే విద్యుత్ కార్యకలాపాలను గుర్తించి మీ ఫోకస్ స్థాయి, అలసట వంటి విషయాలను తెలియజేస్తుంది. భవిష్యత్తులో మెదడు పనితీరును కూడా టెక్నాలజీ ద్వారా నియంత్రించే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది.

ఫోటోలను మాట్లాడించే AI ఫ్రేమ్..

Vinabot రూపొందించిన AI ఫోటో ఫ్రేమ్ మరో ఆసక్తికర ఆవిష్కరణగా నిలిచింది. ఒక ఫోటోకు వాయిస్ లేదా స్క్రిప్ట్ జోడిస్తే AI ఆ వ్యక్తి ముఖాన్ని మాట్లాడుతున్నట్లుగా మార్చుతుంది. జ్ఞాపకాలను సేవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతున్నా, గతంలో ఉన్న వ్యక్తులను డిజిటల్ రూపంలో నిలుపుకోవాలా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతోంది.

మనుషుల డిజిటల్ క్లోన్..

IgniteTech రూపొందించిన MyPersonas ప్లాట్‌ఫామ్ ఉద్యోగుల డిజిటల్ క్లోన్‌ను సృష్టిస్తుంది. ఈ AI మోడల్ ఇమెయిల్స్, మీటింగ్స్, వాయిస్ నోట్స్ ఆధారంగా మీలా మాట్లాడి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. భవిష్యత్తులో పని చేయడానికి మనిషి కంటే డేటా చాలు అనే భావనకు ఇది సంకేతంగా కనిపిస్తోంది.

ఒంటరితనాన్ని తగ్గించే AI స్నేహితుడు..

Lepro Ami అనే గాడ్జెట్ ప్రత్యేకంగా ఒంటరిగా ఉండే వారికి రూపొందించారు. ఈ AI పరికరం వినియోగదారుడి ముఖం, భావాలు, సంభాషణలను అర్థం చేసుకుని తన స్పందనను మార్చుకుంటుంది. అయితే భవిష్యత్తులో నిజమైన మానవ సంబంధాలను AI భర్తీ చేస్తుందా అనే చర్చను ఇది తెరపైకి తీసుకొచ్చింది.

ఆరోగ్యాన్ని విశ్లేషించే స్మార్ట్ టాయిలెట్..

Throne Health Device అనే పరికరం టాయిలెట్‌కు అమర్చుతారు. ఇది శరీరంలో ఉన్న వ్యర్థాలను విశ్లేషించి జీర్ణక్రియ, హైడ్రేషన్ స్థాయి, మందుల ప్రభావం వంటి వివరాలను అందిస్తుంది. ఆరోగ్యాన్ని డేటా ఆధారంగా పర్యవేక్షించే టెక్నాలజీగా ఇది గుర్తింపు పొందుతోంది.

రోజువారీ జ్ఞాపకాలను రికార్డ్ చేసే AI గాడ్జెట్..

Sharp Corporation రూపొందించిన Poketomo అనే చిన్న AI పరికరం రోజువారీ జీవితంలోని క్షణాలను రికార్డ్ చేస్తుంది. తర్వాత యాప్ ద్వారా ఏ సమయంలో జరిగిన సంఘటనలనైనా తిరిగి చూసుకొవచ్చు.

ఫ్యూచర్ టెక్నాలజీ వైపు అడుగులు..

CES 2026లో ప్రదర్శించిన ఈ గాడ్జెట్లు కేవలం టెక్నాలజీ పురోగతిని మాత్రమే కాకుండా మన జీవనశైలిని పూర్తిగా మార్చే అవకాశాన్ని కూడా చూపిస్తున్నాయి. ఆరోగ్యం, జ్ఞాపకాలు, సంబంధాలు, మనసు వంటి అంశాలను టెక్నాలజీ ప్రభావితం చేసే కొత్త యుగానికి ఇది సంకేతంగా భావిస్తున్నారు.

Venkat

Venkat

Next Story