Sanju Samson Success: మంచి వారికి మంచే జరుగుతుంది, నాకు స్ఫూర్తి సంజు శాంసన్: టీమిండియా యువ క్రికెటర్
భారత క్రికెట్‌లో యువ ఆటగాళ్లలో ఒకడైన వికెట్‌కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
Sanju Samson Success: మంచి వారికి మంచే జరుగుతుంది, నాకు స్ఫూర్తి సంజు శాంసన్: టీమిండియా యువ క్రికెటర్
Sanju Samson Success:భారత క్రికెట్‌లో యువ ఆటగాళ్లలో ఒకడైన వికెట్‌కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. దేశవాళీ, టీమిండియా తరఫున మెరుస్తున్న జితేష్.. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్, టీమిండియా వరల్డ్ కప్ 2026 హీరో సంజు శాంసన్‌పై జితేష్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన కెరీర్‌లో వచ్చిన కష్టకాలాలు, ఫామ్‌లోని ఒడిదుడుకులు తాత్కాలికమేనని, వాటిని అధిగమించి తిరిగి నిలబడటం సాధ్యమేనని జితేష్ పేర్కొన్నాడు. ఇందుకు సంజును ఉదాహరణగా పేర్కొన్నాడు.
ఒక ఇంటర్వ్యూలో 'సంజు శాంసన్ సాధించారు, మీరు కూడా సాధించగలరా?' అనే ప్రశ్నకు జితేష్ శర్మ స్పందించాడు. 'ఖచ్చితంగా సాధించగలను. సంజు భాయ్ నాకు పెద్ద ప్రేరణ. యువ ఆటగాడిగా నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఫామ్, రన్స్, సంధి దశ ఏదీ శాశ్వతం కాదు. అన్నీ మారిపోతాయి. నాకు ఇది ఒక రీసెట్‌లా అనిపించింది. నా క్రికెట్ ప్రయాణంలో ఇది కొత్త ఆరంభం' అని చెప్పాడు. 'సంజు భాయ్ నాకు కేవలం క్రికెటర్‌గా మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా ఎంతో ఇష్టం. ఆయన ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకం. మంచి వ్యక్తులకు ఎప్పుడో ఒకప్పుడు మంచి జరుగుతుంది. ఆయనకు మంచి జరగడం చూసి నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. వరల్డ్ కప్ 2026లో అద్భుతంగా ఆడాడు. వచ్చిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. లైఫ్ టైమ్ మెమోరీస్ సంజు కెరీర్లో ఉన్నాయి' అని తెలిపాడు.
జితేష్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు యువ ఆటగాళ్లకు మంచి సందేశంగా నిలుస్తున్నాయి. కష్టకాలాల్లో కూడా నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే విజయం తప్పక వస్తుందని ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. 2015లో భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న సంజు శాంసన్.. పదేళ్ల తర్వాత కానీ సక్సెస్ అందుకోలేదు. భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంతో సంజు పాత్ర ఎంతో కీలకం. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో సంజు 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 89 రన్స్ చేశాడు. అంతకుముందు ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లపై కూడా హాఫ్ సెంచరీలు బాదాడు. వరుసగా మూడు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడిన అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది. ప్రస్తుతం అతడికి భారత టీ20 జట్టులో చోటు ఖాయంగా మారింది.




