Sanju Samson Records: ఒకే ఒక్క టీ20 వరల్డ్‌కప్, ఎన్నో రికార్డులు.. సంజు శాంసన్ సూపరో సూపర్!

Sanju Samson Records: టీ20 వరల్డ్‌ కప్ 2026లో పరుగుల వరద పారించిన భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ .. ఈ మెగా టోర్నమెంట్‌లో సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. 321 పరుగులు చేసి టీ20 వరల్డ్‌ కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Rishvik
Published on: 11 March 2026 7:19 PM IST
Sanju Samson Records
X

Sanju Samson Records: ఒకే ఒక్క టీ20 వరల్డ్‌కప్, ఎన్నో రికార్డులు.. సంజు శాంసన్ సూపరో సూపర్!

Sanju Samson Records: టీ20 వరల్డ్‌ కప్ 2026లో భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్రపంచంలోని క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌పై సూపర్ 8 మ్యాచ్‌లో అజేయంగా 97 పరుగులు చేసిన సంజు.. సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు బాదాడు. ఇక ఫైనల్‌లో న్యూజీలాండ్‌పై 89 పరుగులు చేసి భారత్ భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో భారత జట్టు టైటిల్ గెలుచుకుంది. పరుగుల వరద పారించిన సంజు.. ఈ మెగా టోర్నమెంట్‌లో సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. చారిత్రాత్మక ఘనతలు ఏంటో చూద్దాం.

ఈ టోర్నమెంట్‌లో సంజు శాంసన్ మొత్తం 321 పరుగులు చేసి టీ20 వరల్డ్‌ కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు భారత్ విజయం సాధించిన మ్యాచ్‌ల్లో కూడా 321 పరుగులు చేయడం మరో ప్రత్యేకత. నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా అతని ప్రదర్శన అద్భుతంగా ఉండగా.. సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో 178 పరుగులు నమోదు చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో సంజు చేసిన 89 పరుగులు టీ20 వరల్డ్‌ కప్ ఫైనల్‌లో నమోదైన అత్యధిక స్కోర్లలో ఒకటిగా నిలిచింది. అదే సమయంలో సెమీఫైనల్‌లో కూడా 89 పరుగులు చేసి భారత ఆటగాళ్లలో సంయుక్తంగా అత్యధిక స్కోర్ సాధించిన వారిలో ఒకడిగా నిలిచాడు. అలాగే టీ20 వరల్డ్‌కప్ చేజ్‌లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ అయిన 97 నాటౌట్ కూడా అతని ఖాతాలోనే ఉంది.

ఈ టోర్నమెంట్‌లో సంజు శాంసన్ తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. మొత్తం 24 సిక్సర్లు కొట్టి ఒకే టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లోనే 15 సిక్సర్లు బాదడం విశేషం. ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క మ్యాచ్‌లోనే 8 సిక్సర్లు కొట్టి మరో రికార్డు నెలకొల్పాడు. ఒక మ్యాచ్‌లో 12 ఫోర్లు, మొత్తం 16 బౌండరీలు బాదుతూ టీ20 వరల్డ్‌ కప్‌లో భారత ఆటగాళ్లలో అత్యధిక బౌండరీలు కొట్టిన ఘనతను కూడా సాధించాడు. అంతేకాదు ఈ టోర్నమెంట్‌లో అతని స్ట్రైక్ రేట్ 199.37 ఉండటం అతని దూకుడు బ్యాటింగ్‌కు నిదర్శనం.

సంజు శాంసన్ ఈ వరల్డ్‌ కప్‌లో మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో 80కు పైగా స్కోర్లు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అదేవిధంగా ఒక మ్యాచ్‌లో 108 నిమిషాల పాటు బ్యాటింగ్ చేస్తూ టీ20 మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక సమయం క్రీజ్‌లో ఉన్న ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ టోర్నమెంట్‌లో సంజు సగటు 99.66గా ఉండటం విశేషం. వికెట్ కీపర్‌గా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇంతటి గొప్ప సగటు నమోదు చేసిన ఆటగాడు కూడా ఆయనే. ఐసీసీ టోర్నమెంట్‌ల్లో భారత వికెట్ కీపర్‌గా అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (2) గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు.

ఈ అద్భుత ప్రదర్శనతో సంజు శాంసన్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే ఈ అవార్డు గెలుచుకోవడం కూడా మరో అరుదైన ఘనతగా నిలిచింది. మొత్తంగా టీ20 వరల్డ్‌ కప్ 2026లో సంజు ప్రదర్శన భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా చేసింది.

Rishvik

Rishvik

Next Story