Salman Agha Run Out: గతంలో చేయలేదు, భవిష్యత్తులోనూ చేయం.. రనౌట్‌పై నీతులు చెప్పిన సల్మాన్‌ అఘా!

పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ అయిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీ హసన్ మిరాజ్ ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తుండగా.. సల్మాన్ అఘా దీనిపై ఘాటుగా స్పందించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం అది ఔటైనప్పటికీ.. తానైతే అలా అస్సలు చేయనంటూ నీతులు చెప్పాడు.

Rishvik
Published on: 14 March 2026 4:23 PM IST
Salman Agha Run Out: గతంలో చేయలేదు, భవిష్యత్తులోనూ చేయం.. రనౌట్‌పై నీతులు చెప్పిన సల్మాన్‌ అఘా!
X

Salman Agha Run Out: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ అయిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీ హసన్ మిరాజ్ ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తుండగా.. సల్మాన్ అఘా దీనిపై ఘాటుగా స్పందించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం అది ఔటైనప్పటికీ.. తానైతే అలా అస్సలు చేయనంటూ నీతులు చెప్పాడు. తాము గతంలోనూ ఇలా చేయలేదని, భవిష్యత్తులోనూ చేయం అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ అనంతరం తన రనౌట్‌పై సల్మాన్ అలీ అఘా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. నిబంధనల కంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. 'నిబంధనల ప్రకారం అది అవుటే కావచ్చు, కానీ నేనైతే అలా చేయను. క్రీడాస్ఫూర్తితో వ్యవహరించడం మాకు అలవాటు. పాకిస్థాన్ జట్టు గతంలో ఇలా చేయలేదు, భవిష్యత్తులోనూ చేయదు. నేను కేవలం బంతిని బౌలర్‌కు ఇవ్వడానికే క్రీజు దాటాను తప్ప, పరుగు తీసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నిజం చెప్పాలంటే.. బంతి నా ప్యాడ్‌, బ్యాట్‌ను తాకింది. నన్ను రనౌట్‌ చేయరనుకున్నా. అందుకే బంతిని బౌలర్‌కు అందిద్దామనుకున్నా.. మెహిదీ హసన్ మిరాజ్‌ నన్ను రనౌట్‌ చేశాడు' అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో 39 ఓవర్‌ను బంగ్లా బౌలర్ మెహిదీ హసన్ వేశాడు. నాన్‌ స్ట్రైకింగ్‌లో సల్మాన్ అఘా ఉండగా.. నాలుగో బంతిని స్ట్రైకింగ్‌లోని మహ్మద్ రిజ్వాన్ ఆడాడు. రిజ్వాన్ షాట్ ఆడగా.. బంతి నేరుగా వెళ్లి సల్మాన్ బ్యాట్‌ను తాకింది. వెనుకనే మిరాజ్‌ బంతిని పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. బంతి డెడ్‌ అయిందని భావించిన సల్మాన్.. దానిని మిరాజ్‌కు ఇవ్వబోయాడు. అంతలోనే మిరాజ్‌ బంతిని అందుకుని వికెట్ల వైపు విసిరాడు. బంగ్లా ఆటగాళ్లు అప్పీలు చేయడంతో ఫీల్డ్ అంపైర్.. థర్డ్‌ అంపైర్‌కు నివేదించాడు. రివ్యూ చేసిన థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో తీవ్ర నిరాశతో సల్మాన్ మైదానంను వీడాడు. ఈ ఘటన క్రికెట్ ప్రపంచంలో మరోసారి 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' వర్సెస్ 'రూల్స్' మధ్య చర్చకు దారితీసింది. బంగ్లాదేశ్ విజయం కోసం ఆడిన తీరు సరైనదేనా? లేదా సల్మాన్ అఘా చెప్పినట్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాల్సిందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Rishvik

Rishvik

Next Story