IPL 2025-RCB: ఆర్‌సీబీ కీలక నిర్ణయం.. ప్రతి మ్యాచ్‌లో 11 సీట్లు ఖాళీ!
IPL 2025-RCB: గత ఏడాది జూన్ 4న ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం.. ఇకపై ప్రతి మ్యాచ్‌లో 11 సీట్లను ఖాళీగా ఉంచాలని ఆర్‌సీబీ నిర్ణయించింది.
IPL 2025-RCB: ఆర్‌సీబీ కీలక నిర్ణయం.. ప్రతి మ్యాచ్‌లో 11 సీట్లు ఖాళీ!
IPL 2025-RCB:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జూన్ 4న ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం.. ఇకపై ప్రతి మ్యాచ్‌లో 11 సీట్లను ఖాళీగా ఉంచాలని నిర్ణయించింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగే అన్ని మ్యాచ్‌ల్లో (అంతర్జాతీయ మ్యాచ్‌లతో సహా) 11 సీట్లు ఖాళీగా ఉండి.. బాధితులకు మౌన నివాళిగా నిలవనున్నాయి. ఈ విషయాన్ని ఆర్‌సీబీ సీఈఓ రాజేశ్ మేనన్ మంగళవారం వెల్లడించారు.
11వ నంబర్ జెర్సీలు:
అంతేకాదు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగబోయే ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆటగాళ్లు 11వ నంబర్ జెర్సీలు ధరించనున్నారు. ఈ సీజన్‌లో ప్రాక్టీస్ సెషన్స్ సమయంలోనూ ప్లేయర్లు జెర్సీ నెంబర్ 11ను ధరించనున్నారు. చిన్నస్వామి స్టేడియం లోపల ప్రవేశ ద్వారం సమీపంలో 11 మంది బాధితుల జ్ఞాపకార్థం ఓ స్మారక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అభిమానులు అక్కడికి వచ్చి నివాళులు అర్పించేందుకు ప్రత్యేక స్థలం కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ సీఈఓ రాజేష్ మీనన్ సహా క్రికెట్ డైరెక్టర్ మో బాబట్ మీడియాకు వెల్లడించారు.
300కు పైగా కెమెరాలతో నిఘా:
తొక్కిసలాట ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో కొంతకాలం మ్యాచ్‌లు జరగలేదు. ఐసీసీ టోర్నమెంట్‌లకు కూడా ఆతిథ్యం ఇవ్వలేకపోయింది. అయితే హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం మార్పులు చేపట్టి.. ఇప్పుడు మళ్లీ మ్యాచ్‌లకు అనుమతి పొందింది. ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే మార్చి 28న ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇక్కడ తలపడనున్నాయి. ఆ ఘటన అనంతరం చిన్నస్వామి స్టేడియం భద్రతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భద్రతా చర్యలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. 300కు పైగా కెమెరాలతో కూడిన ఏఐ ఆధారిత సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జనసంచారం ఎక్కువైతే వెంటనే అలర్ట్ వచ్చే విధంగా సదుపాయం కల్పించారు. అలాగే ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను కూడా మార్చి.. భద్రతను కట్టుదిట్టం చేశారు.
టికెటింగ్ విధానంలో కూడా మార్పులు:
అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈసారి టికెటింగ్ విధానంలో కూడా మార్పులు చేశారు. 80-90 శాతం టికెట్లు డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి టికెట్‌కు మెట్రో ప్రయాణం ఉచితంగా ఇవ్వనున్నారు. స్టేడియం వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించారు. మ్యాచ్ ప్రారంభానికి నాలుగు గంటల ముందే గేట్లు తెరవడం ద్వారా రద్దీని తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా చూస్తే.. గతంలో జరిగిన విషాదాన్ని గుర్తుంచుకుంటూ, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్‌సీబీ పలు కీలక చర్యలు చేపట్టింది.




