MS Dhoni-IPL 2026: సంజు వచ్చాడు, ధోనీ స్థానం పట్టేశాడు.. ఐపీఎల్ 2026లో మహీకి సరికొత్త పాత్ర?

MS Dhoni-IPL 2026: ఐపీఎల్ 2026లో సీఎస్కేలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం, సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడే అవకాశముందని సమాచారం.

Rishvik
Published on: 18 March 2026 8:48 PM IST
MS Dhoni-IPL 2026
X

MS Dhoni-IPL 2026: సంజు వచ్చాడు, ధోనీ స్థానం పట్టేశాడు.. ఐపీఎల్ 2026లో మహీకి సరికొత్త పాత్ర?

MS Dhoni-IPL 2026: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య టోర్నీ తొలి మ్యాచ్ జరగనుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ మొదటి మ్యాచ్‌ను మార్చి 30న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో ఆడనుంది. చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో మొదటి హోమ్ మ్యాచ్‌లో ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. అయితే ఈ సీజన్లో సీఎస్కేలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం, సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడే అవకాశముందని సమాచారం.

ఎంఎస్ ధోనీ వర్క్‌లోడ్‌ను తగ్గిస్తూ.. కీలక సమయాల్లో అతని అనుభవాన్ని ఉపయోగించుకునే దిశగా జట్టు మేనేజ్‌మెంట్ ఈ వ్యూహాన్ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వికెట్‌ కీపర్ బాధ్యతలను సంజు శాంసన్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. శాంసన్ ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తూ.. వికెట్‌కీపింగ్ కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మార్పుతో జట్టుకు బ్యాటింగ్‌లో స్థిరత్వం, ఫినిషింగ్‌లో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ లభించనుంది. ఈ కొత్త వ్యూహంతో జట్టు సమతుల్యతను పెంచడంతో పాటు మ్యాచ్‌లలో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ధోనీని కీలక సమయాల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఉపయోగించడం ద్వారా జట్టుకు మరింత బలం చేకూరుతుందని మేనేజ్‌మెంట్ విశ్వసిస్తోంది.

యువ సంచలనం ఆయుష్ మ్హాత్రేతో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మూడో స్థానంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆడనున్నాడు. ఆపై డెవాల్డ్ బ్రెవిస్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ రానున్నారు. ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏ బౌలింగ్ విభాగాన్ని అయినా అడ్డుకోగలదు. ఇక భారత పేసర్ ఖలీల్ అహ్మద్ పేసర్లకు నాయకత్వం వహిస్తాడు. ముఖేష్ చౌదరి, అన్షుల్ కంబోజ్ వంటి టాలెంటెడ్ బౌలర్లు ఉన్నారు. విదేశీ కోటాలో నాథన్ ఎల్లిస్, మాట్ హెన్రీ ఒకరికి అవకాశం దక్కనుంది. యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కీలక మ్యాచ్‌లలో చెన్నై ప్రదర్శన ఎలా ఉంటుందనేది చూడాలి.ఒకవేళ యువ ఆటగాళ్లు క్లిక్ అయితే మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటడం ఖాయం.

Rishvik

Rishvik

Next Story