Kevin Pietersen-IPL: ఐపీఎల్ వల్లే నా కెరీర్ ముగిసింది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

Kevin Pietersen-IPL
x

Kevin Pietersen-IPL: ఐపీఎల్ వల్లే నా కెరీర్ ముగిసింది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

Highlights

Kevin Pietersen IPL controversy: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఐపీఎల్ కారణంగానే తన కెరీర్ ముందుగానే ముగిసిపోయిందని వెల్లడించాడు.

Kevin Pietersen-IPL: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కారణంగానే తన కెరీర్ ముందుగానే ముగిసిపోయిందని వెల్లడించాడు. ఐపీఎల్ ప్రారంభ సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈబీసీ)తో తనకు విభేదాలు జరిగాయని కేపీ వివరించాడు. ఈసీబీ తమ కాంట్రాక్ట్ ప్లేయర్లను ఐపీఎల్‌లో పాల్గొననివ్వలేదని, తాను మాత్రం బోర్డును ఎదురించినట్లు చెప్పాడు. యూట్యూబర్ రణవీర్ అల్లాహబాదియాతో జరిగిన ఇంటర్వ్యూలో పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కేపీ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

'ఐపీఎల్ ప్రారంభ దశలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నాపై విచ్ హంట్ నిర్వహించింది. 2008లో ఐపీఎల్ మొదటి సీజన్ సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లను పాల్గొననీయలేదు. 2009లో పరిమిత కాలానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాను. ఆ తర్వాత ఈబీసీతో నాకు విభేదాలు పెరిగాయి. నేను పెద్ద త్యాగాలు చేశాను. దాని ఫలితంగా నా కెరీర్‌ను కోల్పోయాను. నేను 33 ఏళ్లకే నా అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. నేను 150-160 టెస్టులు ఆడాల్సింది. అలానే 12-13 వేల పరుగులు చేసేవాడిని' అని కెవిన్ పీటర్సన్ తన బాధను వ్యక్తం చేశాడు.

మీడియాను అడ్డుపెట్టుకుని ఈబీసీ తనపై దాడి చేసిందని కూడా కెవిన్ పీటర్సన్ ఆరోపించాడు. 'ది టెలిగ్రాఫ్ ద్వారా ఈబీసీ నాపై విమర్శలు చేయించింది. ఆ సమయంలో ఈసీబీలోని పెద్దలు నాపై గుర్రుగా ఉన్నారు. అప్పట్లో చాలా సెన్సేషనల్ అయింది. ఆ విషయాలను ఇప్పుడు ఎక్కువగా చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను. అప్పట్లో నేను చేసిన త్యాగాల ఫలితంగానే ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెటర్లు లాభపడుతున్నారు. మీరు చేసిన త్యాగాల వల్లే ఇప్పుడు మేం లాభపడుతున్నాం అని జోస్ బట్లర్ కూడా అన్నాడు' అని పీటర్సన్ చెప్పాడు.

కెవిన్ పీటర్సన్ తన కెరీర్‌లో 104 టెస్టుల్లో 8181 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ తరపున 136 వన్డేలు ఆడి 4440 రన్స్ చేశాడు. అలానే 37 టీ20ల్లో 1176 పరుగులు బాదాడు. కెరీర్ మంచి స్థితిలో ఉండగానే 33 ఏళ్లకే రిటైర్మెంట్‌ ఇచ్చాడు. ఐపీఎల్‌లో పీటర్సన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఆడాడు. ఇక 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటర్‌గా కూడా సేవలందించాడు. మొత్తంగా పీటర్సన్ వ్యాఖ్యలు ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ మధ్య ఉన్న సంబంధాలపై మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories