IPL 2026-RCB: అదే ఆర్సీబీకి మేజర్ మైనస్.. మరి బ్యాక్ టు బ్యాక్ టైటిల్ సాధ్యమేనా?
IPL 2026-RCB: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆర్సీబీ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
IPL 2026-RCB: అదే ఆర్సీబీకి మేజర్ మైనస్.. మరి బ్యాక్ టు బ్యాక్ టైటిల్ సాధ్యమేనా?
IPL 2026-RCB: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాయం కారణంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ఆడడం అనుమానంగా ఉండగా.. మిగతా బౌలర్లు ఇటీవలి కాలంలో పెద్దగా రాణించిన దాఖలు లేవు. అయితే బ్యాటింగ్ లైనప్ మాత్రం అత్యంత శక్తివంతంగా ఉండడంతో.. ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాల్‌గా మారే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మరోసారి టైటిల్ గెలుస్తుందా? అన్న ప్రశ్న ఇపుడు ఆసక్తికరంగా మారింది.
ఆర్సీబీలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నాడు. గత సీజన్‌లా పరిస్థితులకు అనుగుణంగా యాంకర్ రోల్‌లో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కింగ్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. కోహ్లీ మెగా ఫామ్ ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద తలనొప్పిగా మారనుంది. కోహ్లీని చూస్తుంటే ఈ ఏడాది కూడా 500-700 రన్స్ సునాయాసంగా చేసేలా ఉన్నాడు. మరో ఓపెనర్‌గా ఫిల్ సాల్ట్ లేదా జేకబ్ బెథెల్‌లలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బెథెల్ 2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉండగా.. సాల్ట్ కూడా అటాకింగ్ స్టార్ట్ ఇవ్వగలడు.
మిడిల్ ఆర్డర్‌లో దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించనున్నాడు. మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేసే సామర్థ్యం అతనికి ఉంది. కెప్టెన్ రాజత్ పటిదార్ స్పిన్నర్లపై ధాటిగా ఆడుతాడు. అవసరమైతే నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టగలడు. ఇక వెంకటేశ్ అయ్యర్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో పాటు మీడియం పేస్ బౌలింగ్‌తో జట్టుకు ఉపయోగపడతాడు. డెత్ ఓవర్లలో టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ జట్టుకు పెద్ద బలం. వీరిద్దరూ చివరి ఓవర్లలో భారీ షాట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. కృనాల్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా బ్యాట్, బాల్‌తో జట్టుకు సమతుల్యతను అందిస్తాడు. ఆర్సీబీ బ్యాటింగ్ పటిష్టంగా ఉందనే చెప్పాలి.
బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ పవర్‌ప్లేలో స్వింగ్‌తో వికెట్లు తీయగలడు. డెత్ ఓవర్లలో కూడా అతడి అనుభవం ఉపయోగపడుతుంది. యశ్ దయాల్ మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో కీలకంగా మారవచ్చు. సుయాష్ శర్మ తన మిస్టరీ స్పిన్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అయితే వీరు ఇటీవలి కాలంలో పెద్దగా క్రికెట్ ఆడలేదు. మరి ఐపీఎల్ 2026లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఇక జోష్ హేజిల్ వుడ్ ఫిట్‌నెస్, అందుబాటుపై అనుమానాలు ఉండటం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. హేజిల్ వుడ్ జట్టులో లేకుంటే.. ఆర్సీబీకి ఇబ్బందులు తప్పవు. మొత్తంగా చూస్తే.. ఆర్సీబీ బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. సరైన వ్యూహాలు, ఆటగాళ్ల ఫామ్ కలిసివస్తే.. ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమి కాదు.




