MS Dhoni-IPL 2026: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ఆడకపోవడమే బెటర్.. మాజీ భారత క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
MS Dhoni-IPL 2026: ఐపీఎల్ 2026 ముందు లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ వయసు, ఫిట్‌నెస్ సమస్యలు, మోకాలి ఇబ్బందులు వంటి అంశాలు ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా చేసిన తాజా వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
MS Dhoni-IPL 2026: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ఆడకపోవడమే బెటర్.. మాజీ భారత క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రతి సీజన్ ముందు లాగే ఈసారి కూడా 'ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ సీజనా?' అనే ప్రశ్న నెట్టింట వైరల్ అయింది. ముఖ్యంగా మహీ వయసు, ఫిట్‌నెస్ సమస్యలు, మోకాలి ఇబ్బందులు వంటి అంశాలు ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా చేసిన తాజా వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
జియోస్టార్ కార్యక్రమంలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోనీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడకూడదని స్పష్టం చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాల్సి వస్తే.. రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్ అని అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో జట్టు నడిపించడం ఫుట్‌బాల్‌లో మాదిరి డగౌట్ నుంచి సాధ్యం కాదని, మైదానంలో ఉండే నాయకత్వమే ముఖ్యమని పేర్కొన్నాడు. ధోనీ ప్రత్యేకత అతని గేమ్ రీడింగ్ సామర్థ్యం, క్లారిటీ, నిర్ణయాలలో ధైర్యం అని చోప్రా కొనియాడారు. అయితే ప్రస్తుతం సీఎస్‌కేలో కొత్త తరం ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో ధోనీ కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా సంజు శాంసన్ జట్టులోకి రావడం, రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడం వంటి మార్పులు జట్టులో కొత్త దిశను సూచిస్తున్నాయి.
ఎంఎస్ ధోనీ కూడా ఇటీవల తన ఫిట్‌నెస్ తగ్గిందని అంగీకరించడం గమనార్హం. ఈ కారణంగా మహీ బ్యాటింగ్ స్థానంలో లోయర్ మిడిల్ ఆర్డర్‌కు మారాడు. డెత్ ఓవర్లలో మాత్రమే అతడి ఆడడం మనం చూస్తున్నాం. ఇది ఒకవైపు జట్టుకు సహకరిస్తూనే, మరోవైపు ఆయనపై శారీరక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎస్‌కే జట్టులో యువ ఆటగాళ్ల సంఖ్య పెరగడం కూడా కీలక పరిణామం. గతంలో “డాడీస్ ఆర్మీ”గా విమర్శలు ఎదుర్కొన్న ఈ జట్టు ఇప్పుడు యువ రక్తంతో కొత్త రూపంలో కనిపిస్తోంది. డేవాల్డ్ బ్రెవిస్, అయుష్ మత్రే, ఉర్విల్ పటేల్ వంటి ఆటగాళ్లు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ సీజన్ కోసం నాథన్ ఎల్లిస్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం ద్వారా సీఎస్‌కే భవిష్యత్తుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. ఐపీఎల్ 2026 ఎంఎస్ ధోనీ కెరీర్‌లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సీజన్ తర్వాత మహీ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అది ఐపీఎల్ చరిత్రలో ఒక యుగానికి ముగింపు అవుతుంది. అదే సమయంలో యువ నాయకత్వానికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే దిశగా సీఎస్‌కే ముందుకు సాగుతోంది. అభిమానులు మాత్రం తమ 'తలా'ను మరికొన్ని సీజన్లు మైదానంలో చూడాలని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో.




