Ugadi 2026 : తెలుగు కొత్త ఏడాదికి ముహూర్తం ఖరారు.. పరాభవ నామ సంవత్సరం విశేషాలివే

Ugadi 2026 : 2026 మార్చి 19న తెలుగు నూతన సంవత్సరం 'శ్రీ పరాభవ నామ సంవత్సరం' ప్రారంభం కానుంది. ఈ పండుగ విశేషాలు, గ్రహ స్థితులు, ఉగాది ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

CR Reddy
Published on: 15 March 2026 8:51 AM IST
Ugadi 2026
X

 Ugadi 2026

Ugadi 2026 : తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అతిపెద్ద పండుగ ఉగాది. కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతికి ఒక కొత్త ఆరంభం. 2026 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వస్తోంది? ఈ కొత్త ఏడాది విశేషాలేంటి? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. ఆరంభం ఎప్పుడు?

ప్రస్తుతం మనం విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నాం. అయితే, 2026 మార్చి 19న తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఏడాదికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అని పేరు. మార్చి 19వ తేదీ గురువారం ఉదయం 6:52 గంటల నుంచే ఈ కొత్త ఏడాది మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సంవత్సరం వృషభ రాశిలో ప్రారంభం కాబోతోంది. శని దేవుడు మీన రాశిలో, గురు గ్రహం కర్కాటక రాశిలో సంచరించడం వంటి కీలక గ్రహ మార్పులతో ఈ ఏడాది అడుగుపెడుతోంది. గతంలో సరిగ్గా 60 ఏళ్ల క్రితం అంటే 1966-67లో ఇదే పరాభవ సంవత్సరం వచ్చింది. మన తెలుగు పంచాంగంలో ఉన్న 60 సంవత్సరాలలో ఇది 40వది.

ఉగాది అంటే కేవలం పచ్చడి మాత్రమే కాదు..

పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటాం. ఉగ అంటే నక్షత్ర గమనం అని అర్థం. బ్రహ్మ పురాణం ప్రకారం, బ్రహ్మ దేవుడి ఆయుష్షు వందేళ్లు. ప్రస్తుతం ఆయన వయస్సు 52 ఏళ్లు అని, మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నామని పండితులు చెబుతుంటారు. అందుకే మనం పూజ చేసేటప్పుడు శ్వేతవరాహ కల్పే.. వైవస్వత మన్వంతరే.. కలియుగే ప్రథమపాదే.. అని చదువుతాం. ఈ రోజే విష్ణుమూర్తి మత్స్యావతారంలో వేదాలను రక్షించారని, శ్రీరాముడు, విక్రమాదిత్యుడు వంటి మహారాజులు పట్టాభిషేకం చేసుకున్నారని ప్రతీతి.

దేశవ్యాప్తంగా ఉగాది వేడుకలు

మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అని పిలుచుకునే ఈ పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కర్ణాటకలోనూ దీనిని ఉగాది అనే అంటారు. కానీ మహారాష్ట్రలో గుడిపాడ్వా అని, తమిళనాడులో పుత్తాండు అని, కేరళలో విషు అని పిలుస్తారు. సిక్కులు దీనిని వైశాఖీగా జరుపుకుంటే, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ పేరుతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. పేరు ఏదైనా, కొత్త ఏడాది తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకోవడం అందరి ఉద్దేశం.

60 ఏళ్ల చక్రం వెనుక అసలు కథ ఏమిటి?

తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం, శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సందీపని సంతానం పేర్లనే ఈ 60 ఏళ్లకు పెట్టారని అంటారు. మరికొందరు ఇవి నారద మహర్షి సంతానం పేర్లని, ఇంకొందరు దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని నమ్ముతారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి లాగే, ఈ కొత్త సంవత్సరం కూడా అందరి జీవితాల్లో తీపి, కారం, చేదులను సమపాళ్లలో మేళవించి సుఖశాంతులను ఇస్తుందని ఆశిద్దాం.

CR Reddy

CR Reddy

Next Story