Baijnath Temple: భారత్‌లో బ్రిటీషర్లు నిర్మించిన ఏకైక ఆలయం ఎక్కడుందో తెలుసా?

Baijnath Temple
x

Baijnath Temple: భారత్‌లో బ్రిటీషర్లు నిర్మించిన ఏకైక ఆలయం ఎక్కడుందో తెలుసా?

Highlights

Baijnath Temple: భారత్‌లో వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ సంప్రదాయం ఉంది. విదేశీ పాలనలో ఎన్నో దేవాలయాలు ధ్వంసమైన కాలంలో కూడా ఒక బ్రిటీష్ అధికారి స్వయంగా ఆలయం నిర్మించడమంటే ఆశ్చర్యమే.

Baijnath Temple: భారత్‌లో వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ సంప్రదాయం ఉంది. విదేశీ పాలనలో ఎన్నో దేవాలయాలు ధ్వంసమైన కాలంలో కూడా ఒక బ్రిటీష్ అధికారి స్వయంగా ఆలయం నిర్మించడమంటే ఆశ్చర్యమే. అదే మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా అగర్ మాల్వాలో ఉన్న బైద్యనాథ్ మహాదేవ్ ఆలయం.

బ్రిటీష్‌ అధికారిని రక్షించిన మహాశివుడు

భారత్‌లో ఆలయాన్ని నిర్మించిన ఏకైక బ్రిటీష్‌ అధికారి కల్నల్‌ మార్టిన్‌. 1880 ప్రాంతంలో బ్రిటీష్‌ ప్రభుత్వం ఆదేశాల మేరకు కల్నల్‌ ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న యుద్ధానికి వెళ్లవలసి వచ్చింది. ఆ యుద్ధంలో ఎందరో మరణించారు. యుద్ధానికి వెళ్లిన కల్నల్‌ గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆయన భార్య తీవ్రమైన ఆందోళనకు గురైంది. రోజులు గడుస్తున్నాయి. భర్తకు సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఓ రోజు ఆమె తీవ్రమైన విచారంతో నడుస్తుండగా ఓ పాత శివాలయంలోనుంచి గంటల శబ్దం వినిపిస్తుంది. ఆమెకు తెలియకుండానే ఆ ఆలయం వైపు నడుస్తుంది. ఆలయంలోని పూజారి ఆమె బాధను గమనించి శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. భక్తితో ప్రతిరోజూ జపించమని సూచిస్తాడు.

పూజారి చెప్పిన విధంగా ఆమె భక్తితో పంచాక్షరి మంత్రాన్ని జపిస్తుంది. ఆశ్చర్యంగా 11వ రోజు భర్త సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తాడు. యుద్ధంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనను పులిచర్మం ధరించిన ఒకతను రక్షించాడని కల్నల్‌ చెబుతాడు. ఆ విషయం విని ఆశ్చర్యపోయిన కల్నల్‌ భార్య జరిగిన విషయం చెబుతుంది. నాటి నుంచి భార్యభర్తలు మహాశివుడి భక్తులుగా మారిపోతారు.

ఆలయ పునఃర్నిర్మాణం

అప్పటికే శిథిలావస్థకు చేరుకున్న శివాలయాన్ని ఎలాగైన పునఃర్నిర్మాణం చేయాలని అనుకుంటారు. తమ దగ్గరున్న ధనంతో ఆలయాన్ని పునఃర్నిర్మిస్తారు. నాటి నుంచి ఆ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. భగవంతుడిపై నమ్మకం ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలిపేలా ఈ సంఘటనను ఆలయం వద్ద శిలాఫలకంపై చెక్కించారు. ఆలయాన్ని సందర్శించినవారికి అపమృత్యుభయం తొలగిపోతుందని, నమ్మకంతో ఆలయంలో కూర్చొని శివపంచాక్షరి మంత్రం జపిస్తే కష్టాల సుడిగుండాల నుంచి మహాశివుడు రక్షిస్తాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా విశ్వాసం, సంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నంగా నిలుస్తోంది. బ్రిటీష్‌ అధికారి నిర్మించిన ఈ ఆలయాన్ని సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారు. ఒక విదేశీయుడిని కూడా భక్తుడిగా మార్చిన ఈ ఆలయం కథ మనదేశ ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం అని చెప్పాలి. విశ్వాసం ఉంటే మార్పు ఎక్కడైనా సాధ్యమే అనే సందేశాన్ని ఈ ఆలయం అందిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories