Wedding Cards: పెళ్లి శుభలేఖల్లో ఎలాంటి రంగులు వాడాలి? శాస్త్రం ఏం చెబుతోంది?
Wedding Cards: వివాహ ఆహ్వాన పత్రిక పెళ్లి తంతులో ఒక ముఖ్యమైన విషయం. శుభలేఖ అందంగా శాస్త్రీయంగా ఉండేలా చూసుకోవాలి. వెడ్డింగ్ కార్డు విషయంలో శాస్త్రం ఏమి చెబుతుందంటే . .
Wedding Cards
Wedding Cards: పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయింది. జోరుగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. రాబోయే రెండు నెలలు వరుసగా ముహూర్తాలు ఉన్నాయి. చాలామంది వధూవరులు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అవుతున్నారు. పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టే వధూవరులు నూరేళ్లు సంతోషంగా.. అన్యోన్యంగా జీవించాలని కోరుకుంటారు. ఒక ఇంటిలో ఎవరికైనా వివాహం చేయాలని భావించినపుడు ప్రతి విషయానికి మంచి రోజు.. మంచి సమయం చూసుకోవడం సహజం. అలానే పెళ్ళికి వధూవరుల నక్షత్రాదులను బట్టి శుభముహూర్తాన్ని నిర్ణయిస్తారు. సనాతన ధర్మ గ్రంధాలు వివాహానికి సంబంధించి అనేక నిర్దిష్టమైన నియమాలను వివరిస్తాయి. వధూవరుల జాతక చక్రాలు పరిశీలించడం నుంచి.. వివాహం జరిగే వరకూ ప్రతి కార్యక్రమానికి నిర్దిష్టమైన పద్ధతులు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి.. కులాన్ని బట్టి కొన్ని ఆచారాల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు కానీ, సనాతన ధర్మం వివరించిన మూల తంతుల్లో మాత్రం మార్పు ఉండదు. అలా సనాతన ధర్మశాస్త్రం చెప్పిన వివాహ విషయాల్లో శుభలేఖ కు సంబంధించి కొన్ని ప్రత్యేక సూచనలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం
ప్రస్తుతం పెళ్లి అంటే ఆడంబరం.. పెద్ద వేడుక.. బోలెడు ఖర్చు.. ఆధునికతను సంతరించుకుంటున్న కార్యక్రమాలు. అలానే వివాహ ఆహ్వాన పత్రికల్లో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీతనంతో.. రకరకాల డిజైన్లతో.. శుభలేఖలు తయారు చేయిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, వెడ్డింగ్ కార్డులో వాడాల్సిన భాష.. రంగులు.. బొమ్మలు ఎలా ఉండాలో సనాతన ధర్మశాస్త్రం వివరంగా చెప్పింది.
శుభలేఖలో రంగులు..
వివాహ ఆహ్వాన పత్రికల కోసం ఎరుపు, పసుపు, కుంకుమ లేదా క్రీమ్ రంగులను ఉపయోగించడం చాలా శుభప్రదం. ఎరుపు రంగు ప్రేమ, బలం, వైవాహిక బంధానికి చిహ్నం. పసుపు - కుంకుమ రంగులు శుభ ప్రారంభం, శ్రేయస్సును సూచిస్తాయి. అందుకే ఆ రంగులనే వాడడం మంచిదని శాస్త్రం చెబుతోంది. అయితే, వెడ్డింగ్ కార్డుల్లో నలుపు లేదా ముదురు గోధుమ రంగులను వాడడం శుభకరం కాదు. ఎందుకంటే, ఈ రంగులు నెగెటివిటీ.. విచారాన్ని చిహ్నంగా చెబుతారు. అందుకే ఈ రంగులను శుభలేఖల్లో ఉపయోగించ కూడదు.
పెళ్లి కార్డు డిజైన్:
వెడ్డింగ్ కార్డ్స్ ఇప్పుడు అందమైన డిజైన్లలో భారీతనం ఉట్టిపడేలా తయారు చేయిస్తుండడం చూస్తూనే ఉన్నాం. కార్డులపై రకరకాల బొమ్మలు.. చిహ్నాలు ఉపయోగించడం కూడా కనిపిస్తోంది. కానీ శుభలేఖలపై దేవుళ్ల చిత్రాలు లేదా శుభ చిహ్నాలు ఉండాలి. ముఖ్యంగా గణేశుడి చిత్రాన్ని చేర్చడం చాలా ముఖ్యం అని శాస్త్రం చెబుతోంది. అడ్డంకులను తొలగించే గణేశుడి ఆశీస్సులు లేకుండా ఏ శుభ కార్యమూ పూర్తి కాదనేది నమ్మకం. అలానే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా విఘ్ననాయకుని పూజతోనే మొదలు పెడతాం. పెళ్లి వేడుకల్లో ఆహ్వాన పత్రికపై విఘ్నేశ్వరుడు ఉండడం విఘ్నలను దూరం చేస్తుంది. అలాగే వివాహ కార్డులపై స్వస్తిక్, కలశం వంటి శుభ చిహ్నాలను ఉపయోగించడం మంచిది. ఇవి పాజిటివిటీని వ్యాపింపజేస్తాయని, వివాహ జీవితాన్ని ఆనందమయం చేయడంలో సహాయపడతాయని నమ్ముతారు. వింత వింతగా గందరగోళంగా ఉండే డిజైన్లను శుభలేఖలు కోసం వాడకపోవడం మంచిదని శాస్త్రం చెబుతోంది.
అందమైన పదాలతో ఆహ్వానం:
శుభలేఖలో ఉపయోగించే పదాలు చాలా ముఖ్యమైనవి. భాష స్వచ్ఛంగా ఉండాలి. పదాలు మృదువుగా ఉండాలి. కఠినమైన, భారీ లేదా ప్రతికూల పదాలను ఉపయోగించకపోవడమే మంచిది. కార్డుపై యుద్ధం, దుఃఖం లేదా నిరాశను సూచించే చిత్రాలు లేదా పదాలు ఉండకూడదు. శుభ సమయం, తేదీ, సమయం స్పష్టంగా.. లోపాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. సంప్రదాయం ప్రకారం, మొదటి వివాహ కార్డును కుటుంబ దేవత లేదా గణేశుడికి అంకితం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
వెడ్డింగ్ కార్డుపై ఫోటోలు..
ఈ రోజుల్లో, చాలా మంది పెళ్లి కార్డులపై వధూవరుల ఫోటోలను ప్రింట్ చేయడం చూస్తున్నాం. అయితే, శాస్త్రం ప్రకారం, ఇలా చేయడం మంచిది కాదు. వధూవరుల ఫోటోలను ప్రింట్ చేయడం వలన దృష్టి దోషాలకు కారణం అవుతుందని నమ్ముతారు.
వివాహం అనేది జీవితంలో ఒక కీలకమైన మలుపు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న వేడుక. ఇలాంటి వేడుక కోసం నూరేళ్లు గుర్తుండిపోయేలా ప్రతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరుపుకోవడం వివాహబంధాన్ని సంతోషమయం చేస్తుంది.
ఇక్కడ ఇచ్చిన అంశాలు వివిధ సందర్భాల్లో పండితులు చెప్పిన మాటలు.. శాస్త్రాల ఆధారంగా వచ్చిన పుస్తకాలు.. ఇంటర్నెట్ లో కనిపించిన వివిధ ఆర్టికల్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఆయా వ్యక్తుల నమ్మకాలపై ఆధారపడి ఉండే విషయాల సమాహారం. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది.




