Vande Bharat Journey: అరే.. మీరు మారరా? వందేభారత్ లో యువకుని చెత్త ప్రవర్తన వైరల్

Vande Bharat Journey: వందే భారత్ ట్రైన్ లో ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

KVD Varma
Published on: 17 March 2026 6:01 PM IST
Vande Bharat Journey: వందే భారత్ ట్రైన్ లో ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్
X

Vande Bharat Journey

Vande Bharat Journey: గతంలో ఏదైనా ఊరు వెళ్లాలని రైలు ఎక్కితే ముక్కు మూసుకునే ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఛీ..ఛీ ఈ రైల్వే వాళ్ళు అసలు శుభ్రం చేయరు అని తిట్టుకునేవాళ్ళం. కాలం మారింది. రైల్వే పద్ధతులూ మారాయి. రైళ్లలో సౌకర్యాల్లోనూ భారీగా మార్పులు వచ్చాయి. రైళ్ల వేగం పెరిగింది. ఏసీ ట్రైన్స్ లో సుఖవంతమైన ప్రయాణమూ దొరుకుతోంది. దానికి మన జేబులు ఖాళీ చేసే టికెట్ ధరలూ ఉంటున్నాయి. అయితే, మనమే మారలేదు. అవును.. మీరు సరిగ్గానే చదివారు. మనమే మారలేదు. ఎందుకంటే, సివిక్ సెన్స్ అనేది మనం ఇంకా నేర్చుకోలేదు. మన సుఖం.. మన ప్రయాణం.. మన సంతోషం అంతే. పక్కోడు ఇబ్బంది పడినా.. ఎవడు ఏమనుకున్నా మనం ఇంతే.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, సోషల్ మీడియాలో ఒక ఫోటో చూశాకా.. నెటిజన్లు చేసిన కామెంట్స్ కూడా చెప్పాలనిపించింది . ఇంతకీ 'CursedsundariX' అనే హ్యాండిల్ ద్వారా X (గతంలో ట్విట్టర్)లో షేర్ అయిన పోస్ట్ లో ఏముందంటే.. ఒక యువకుడు వందే భారత్ లో ప్రయాణిస్తున్నాడు. అతను తన ముందున్న ఫుడ్ టేబుల్ మీద కాళ్ళు చాపి పెట్టుకుని బుక్ చదువుతున్నాడు. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపట్లోనే వైరల్ అయిపొయింది. లక్షలాది మంది దానిని చూశారు. చాలామంది కామెంట్ చేశారు. అతని ప్రవర్తన చూస్తే చదువుకున్న వ్యక్తిలా అనిపించడంలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ ట్వీట్ మీరూ ఇక్కడ చూసేయండి..


చూశారుగా.. ఇక నెటిజన్లు చేసిన కామెంట్స్ ఇక్కడ చూడండి..

"భారతదేశంలోని అన్ని ఉద్యోగాలకు, అందరికీ పౌరశాస్త్రం తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి," అని ఒక యూజర్ అన్నారు. "స్విట్జర్లాండ్‌లో లేదా యూరప్‌లోని ఇతర ప్రాంతాలలో రైలులో ఇలా చేస్తారో లేదో?" అని కామెంట్ సెక్షన్‌లో తర్వాతి వ్యక్తి వ్యాఖ్యానించారు.

"మీరు దాని ఉద్దేశ్యాన్ని వారికి తెలియజేస్తే, ప్రజలు తమను తాము సమర్థించుకోవడం ప్రారంభిస్తారు. తాము తప్పు చేశామని అంగీకరించరు. ఇది కఠినమైన నిజం," అని ఒకరు వ్యాఖ్యానించారు.

అయితే దానికి విరుద్ధంగా "అది ఒక బల్ల, అది అన్ని పనుల కోసం ఉంటుంది, కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు," అని మరొకరు ఆ వ్యక్తి చర్యను సమర్ధించారు.

అలాగే, ఇలా ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే టైం మీకున్నపుడు.. అతన్ని సరిగ్గా ఉండమని చెప్పడానికి కూడా టైం ఉంటుంది కదా.. ఎందుకు చెప్పలేకపోయారు? అని ప్రశ్నించారు.

"అతని కాళ్లకు నిప్పు పెట్టండి. అతను దానికి అర్హుడు," అని మరొకరు సరదాగా అన్నారు.

అదండీ విషయం . . ఇదివరకు మనం ఎలా ప్రవర్తించినా మన పక్కోళ్లకి తప్ప ఎవరికీ ఏమీ తెలిసేది కాదు . కానీ , ఇప్పుడు ఎవరు ఏ పక్క నుంచి ఫోటో తీస్తారో . . వీడియో లాగిస్తారో అర్ధం కానీ పరిస్థితి . అందుకే బహిరంగ ప్రదేశాల్లో ఉన్నపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఇలానే లక్షలాది మందికి చేరిపోతారు. వందలాది మంది చేతికి వచ్చినట్టు కామెంటేస్తారు . అది చెప్పడం కోసమే ఈ ఆర్టికల్.






KVD Varma

KVD Varma

Next Story