
World Health Day :ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేళ ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి.. 100 ఏళ్లు హ్యాపీగా బతకండి
World Health Day :ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేళ ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి.. 100 ఏళ్లు హ్యాపీగా బతకండి
World Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం. ఈ రోజునే 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ను స్థాపించారు. దీనికి గుర్తునే ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించేందుకు ఈ రోజును నిర్వహిస్తారు. ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు ప్రజలు ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ద్వారా ప్రధానంగా ఈ అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సమస్యలపై ప్రజలకు సమాచారం అందించడం, అందరికీ నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవల అవసరాన్ని గుర్తుచేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం
శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండింటి ప్రాముఖ్యతను తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం.
ఈ ఏడాది థీమ్ ఏంటేంటే.?
ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని “Together for health. Stand with science” అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.
ఈ థీమ్ ద్వారా శాస్త్రంపై నమ్మకం ఉంచాలని, ఆరోగ్య రంగంలో శాస్త్రీయ పరిశోధనలు ఎంత ముఖ్యమో తెలియజేయడం లక్ష్యం. మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం ఆరోగ్యాన్ని రక్షించడంలో శాస్త్రవేత్తల సహకారం ఎంత కీలకమో ఈ ప్రచారం ద్వారా వివరించనున్నారు. ఈ థీమ్ ఆధారంగా WHO ఏడాది పొడవునా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో భాగం చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం, తీసుకునే ఆహారంలో జాగ్రత్త
రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి సాధారణ వ్యాయామాలు శరీరంలో శక్తిని పెంచుతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఎంత ముఖ్యమో, దాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తినడం కూడా అంతే ముఖ్యం. ఇలా తింటే అవసరానికి మించి తినే అలవాటు తగ్గుతుంది.
మొబైల్ ఫోన్ వినియోగం, నోటి ఆరోగ్యం
అధికంగా ఫోన్ ఉపయోగించడం నిద్రపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల అలసట, తల నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే నిద్రకు కనీసం ఒక గంట ముందు మొబైల్ వాడకాన్ని ఆపడం మంచిది. ఇక మంచి ఆరోగ్యానికి నోటి ఆరోగ్యం కూడా ముఖ్యం. అందుకే ఉదయం, రాత్రి పళ్లు తోమడం అలవాటు చేసుకోవాలి. ఇది దంతాల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పళ్ల నొప్పి, దంత సమస్యలను తగ్గిస్తుంది.
నిద్ర విషయంలో జాగ్రత్తలు
ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం వల్ల శరీరంలోని బయోలాజికల్ క్లాక్ సరిగ్గా పనిచేస్తుంది. దీని వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. అలాగే రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం శరీరానికి చాలా అవసరం. ఇది శరీరంలో నీటి శాతం నిలబెట్టడంలో సహాయపడుతుంది. నీటిలో నిమ్మకాయ, కీర ముక్కలు వేసి తాగితే ఆరోగ్యానికి మంచిది.
పొగతాగడం పూర్తిగా మానాలి
పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు, గొంతు, నోరు వంటి భాగాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా ఇది కారణమవుతుంది. అందుకే ఈ అలవాటును పూర్తిగా దూరం పెట్టాలి. మద్యం కూడా ఆరోగ్యాన్ని క్రమంగా క్షీణింపజేస్తుంది. ఈ అలవాటు కూడా ఉంటే మానుకోవాలి. అలాగే ప్యాకెట్లలో లభించే రెడీమేడ్ ఫుడ్ పూర్తిగా మానేయ్యాలి. ఇందులో ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మంచి అలవాట్లు పెంచుకోవాలి
పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, తోటపని చేయడం వంటి హాబీలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. పరిశోధనల ప్రకారం హాబీలు ఉన్నవారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇక
శరీర ఆరోగ్యంతో పాటు మనసు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర, ఆనందకరమైన కార్యకలాపాలు ఇవన్నీ కలిసే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. మొత్తం మీద ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. ఆరోగ్యమే మన పెద్ద సంపద. చిన్న చిన్న మంచి అలవాట్లు పాటిస్తే దీర్ఘకాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire


