Supreme Court: భార్య పనిమనిషి కాదు..సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court: విడాకుల కేసు విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను పనిమనిషిగా భావించడం సరైనది కాదని ధర్మాసనం పేర్కొంది.
Supreme Court
Supreme Court: "భార్య సరిగ్గా వంట చేయకపోవడం లేదా ఇంటి పనులు చేయకపోవడం క్రూరత్వం కిందకు రాదు. మీరు పెళ్లి చేసుకుంటున్నది పనిమనిషిని కాదు, జీవిత భాగస్వామిని." అని శుక్రవారం ఒక విడాకుల కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. "కాలం మారింది, ఇంటి పనులలో భర్తలు సమాన బాధ్యత పంచుకోవాలి. ఈ రోజుల్లో భర్తలు కూడా వంట చేసి, ఇంటి పనులు చేయాలి." అంటూ జస్టిస్‌లు సందీప్ మెహతా, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ధర్మాసనం ఇంకా తుది తీర్పు వెలువరించలేదు. తదుపరి విచారణకు భార్యాభర్తలు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
ఇదీ విషయం..
ఈ దంపతులకు 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ దంపతులకు 2017లో వివాహం జరిగింది. వారికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా, భార్య లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వారు కోర్టుకు తెలిపిన ప్రకారం, భార్య తన భర్త కంటే ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంది. ఇప్పటివరకు ఎలాంటి భరణం లేదా పోషణ భృతిని కోరలేదు.
భర్త ఇలా అంటున్నాడు..
పెళ్ళి జరిగిన వారం రోజులకే తన భార్య ప్రవర్తన మారిపోయిందని భర్త ఆరోపిస్తున్నాడు. ఆమె తనతో అమర్యాదగా ప్రవర్తించడం, తనను, తన తల్లిదండ్రులను దూషించడం మొదలుపెట్టింది. ఇంట్లో వంట చేయడానికి కూడా ఆమె నిరాకరించింది. బిడ్డ పుట్టిన తర్వాత జరిగిన నామకరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని కూడా అతను చెప్పాడు.
భార్య ఇలా చెబుతోంది..
తన భర్త, అతని కుటుంబం సమ్మతితోనే బిడ్డ జననం కోసం తాను పుట్టింటికి వెళ్ళానని భార్య వాదిస్తోంది. అయితే, ఆమె భర్త, అతని కుటుంబం నామకరణ కార్యక్రమానికి హాజరు కాలేదు. అంతేకాకుండా, తన తల్లిదండ్రులను నగదు, బంగారం అడిగారని, జీతం వదులుకోవాలని తనపై ఒత్తిడి చేశారని కూడా ఆమె ఆరోపిస్తోంది.
హైకోర్టులో కేసు కొట్టేస్తే..
కుటుంబ న్యాయస్థానం భర్త పిటిషన్‌ను అంగీకరించి, క్రూరత్వం అనే కారణంతో విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత భార్య ఈ నిర్ణయాన్ని హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు కుటుంబ న్యాయస్థానం నిర్ణయాన్ని రద్దు చేసి, విడాకులను కొట్టివేసింది. హైకోర్టు ఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన భర్త, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.




