Supreme Court: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం: తప్పుడు కేసుల వేధింపులకు అడ్డుకట్ట వేయాలని ఆదేశం!

Supreme Court: దేశవ్యాప్తంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో వేధింపులకు అస్త్రంగా మారిన తప్పుడు ఫిర్యాదులు, కల్పిత ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక చర్యలు చేపట్టింది.

Arun Chilukuri
Published on: 24 March 2026 3:49 PM IST
Supreme Court
X

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం: తప్పుడు కేసుల వేధింపులకు అడ్డుకట్ట వేయాలని ఆదేశం!

Supreme Court: దేశవ్యాప్తంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో వేధింపులకు అస్త్రంగా మారిన తప్పుడు ఫిర్యాదులు, కల్పిత ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక చర్యలు చేపట్టింది. నకిలీ సాక్ష్యాలు, తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ల (FIRs) వల్ల అమాయకులు బలికావడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై మంగళవారం విచారణ జరిపింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ప్రస్తుత చట్టాల్లోని కొన్ని నిబంధనలు తప్పుడు కేసుల బాధితులకు జవాబుదారీతనం లేకుండా చేస్తున్నాయని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్ లేవనెత్తిన కీలక అంశాలు:

చట్టం దుర్వినియోగం: భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS), 2023లోని కొన్ని సెక్షన్లు (215, 379) తప్పుడు ఫిర్యాదుదారులకు కవచంలా మారుతున్నాయని, దీనివల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టులు నకిలీ కేసులతో నిండిపోతున్నాయని ఆరోపించారు.

న్యాయపోరాటంలో అడ్డంకులు: తప్పుడు కేసుల బాధితులు నేరుగా ఎదురుదాడి చేసేందుకు కోర్టు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి కావడం, అమాయకులకు శాపంగా మారిందని వాదించారు.

ఆత్మహత్యల ఆవేదన: తప్పుడు కేసుల బెదిరింపులు తట్టుకోలేక ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనను పిటిషన్‌లో ఉదహరించారు. అమాయకులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి రావడం వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు జోక్యం:

చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని, అమాయక పౌరుల హక్కులను కాపాడాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. దీనిపై సమగ్ర విచారణకు సిద్ధమైంది. తదుపరి విచారణను మే 11కు వాయిదా వేసే అవకాశం ఉంది. అప్పటిలోగా కేంద్రం, రాష్ట్రాలు తమ స్పందనను తెలియజేయాల్సి ఉంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story