Crude Oil:పెట్రోల్ టెన్షన్ తీరినట్లేనా? ముంబై రిఫైనరీలకు చేరుతున్న చమురు నౌక

Crude Oil:మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతున్నా, సౌదీ అరేబియా నుండి 1.35 లక్షల టన్నుల ముడి చమురుతో కూడిన నౌక సురక్షితంగా ముంబై చేరుకుంది. భారతీయ కెప్టెన్ చాకచక్యంతో హోర్ముజ్ జలసంధిని దాటుకుంటూ ఈ విజయం సాధ్యమైంది.

CR Reddy
Published on: 13 March 2026 9:52 AM IST
Crude Oil
X

Crude Oil

Crude Oil:మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత ఇంధన అవసరాలకు సంబంధించి ఒక ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకుని, సముద్ర మార్గాల్లో నౌకలపై దాడులు జరుగుతున్నా.. సౌదీ అరేబియా నుంచి భారీ మొత్తంలో ముడి చమురును మోసుకొచ్చిన ఒక నౌక సురక్షితంగా ముంబై తీరానికి చేరుకుంది. అత్యంత ప్రమాదకరమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్(Hormuz Strait) జలసంధిని దాటుకుంటూ ఈ నౌక భారత్‌కు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

లైబీరియా జెండాతో ప్రయాణించిన షెన్లాంగ్ (Shenlong) అనే భారీ సుయెజ్‌మాక్స్ చమురు ట్యాంకర్ సుమారు 1,35,335 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో సౌదీ అరేబియాలోని రాస్ తనురా పోర్ట్ నుంచి బయలుదేరింది. ఈ నౌకకు భారతీయుడే కెప్టెన్ కావడం విశేషం. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో ఎప్పుడు ఏ వైపు నుంచి మిస్సైళ్లు లేదా డ్రోన్ దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య, భారతీయ కెప్టెన్ తన చాకచక్యంతో నౌకను సురక్షితంగా ముంబై పోర్టుకు చేర్చారు.

ఈ ప్రయాణంలో అత్యంత సాహసోపేతమైన విషయం ఏమిటంటే.. శత్రువుల కంటికి చిక్కకుండా ఉండేందుకు ఈ నౌక తన ఏఐఎస్ (AIS - Automatic Identification System) ట్రాకింగ్ సిస్టమ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. సాధారణంగా సముద్రంలో నౌక ఎక్కడ ఉందో ట్రాక్ చేయడానికి ఈ సిస్టమ్ వాడతారు. కానీ యుద్ధ ప్రాంతాల్లో దాడుల నుండి తప్పించుకోవడానికి కొన్నిసార్లు ఇలా ఘోస్ట్ షిప్ లా ప్రయాణించాల్సి వస్తుంది. మార్చి 9వ తేదీన ప్రమాదకర ప్రాంతాన్ని దాటిన తర్వాతే కెప్టెన్ మళ్ళీ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఆన్ చేశారు. ప్రస్తుతం ముంబై చేరుకున్న ఈ చమురును పైపులైన్ల ద్వారా తూర్పు ముంబైలోని మాహుల్ రిఫైనరీలకు తరలిస్తున్నారు.

మరోవైపు, ఇలాంటిదే ఇంకొక చమురు నౌక కూడా భారత్ వైపు వస్తోందని సమాచారం. యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని, సరఫరా ఆగిపోతుందని ప్రజల్లో ఆందోళన నెలకొన్న తరుణంలో.. భారత ప్రభుత్వం మాత్రం నిశ్చింతగా ఉంది. దేశంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని, సముద్ర మార్గాల్లో దాడులు జరిగినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా కొనసాగుతుందని భరోసా ఇస్తోంది. భారత నావికాదళం కూడా హిందూ మహాసముద్ర ప్రాంతంలో మన వాణిజ్య నౌకలకు రక్షణగా నిలుస్తోంది.

CR Reddy

CR Reddy

Next Story