Rajya Sabha Elections : సిమ్లా కొండల్లో రిసార్ట్ పాలిటిక్స్.. హర్యానా ఎమ్మెల్యేల చుట్టూ గట్టి నిఘా పెట్టిన కాంగ్రెస్

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో హర్యానా కాంగ్రెస్ తన 31 మంది ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్‌లోని రిసార్టులకు తరలించింది. క్రాస్ ఓటింగ్ భయంతో పార్టీ ఈ జాగ్రత్తలు తీసుకుంది.

CR Reddy
Published on: 15 March 2026 12:10 PM IST
Rajya Sabha Polls
X

Rajya Sabha Polls

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో రిసార్ట్ పాలిటిక్స్ మరోసారి హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా హర్యానాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం జరగబోయే ఎన్నికలు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కొండల్లో చర్చనీయాంశంగా మారాయి. తమ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లోనవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యగా 31 మంది ఎమ్మెల్యేలను సిమ్లా సమీపంలోని కుఫ్రి ప్రాంతానికి తరలించింది. మార్చి 16న (సోమవారం) ఓటింగ్ జరగనుండగా, అప్పటి వరకు వీరిని పటిష్ట భద్రత మధ్య రిసార్టుల్లోనే ఉంచాలని పార్టీ నిర్ణయించింది.

శనివారం ఈ ఎమ్మెల్యేలంతా కుఫ్రి నుంచి సమీపంలోని పర్యాటక ప్రాంతమైన చైల్‌ను సందర్శించారు. మూడు చిన్న బస్సులు, భారీ కార్ల కాన్వాయ్ మధ్య వీరి ప్రయాణం సాగింది. వీరి కోసం కుఫ్రిలోని రెండు లగ్జరీ రిసార్టుల్లో ఏకంగా 37 గదులను బుక్ చేశారు. ఈ రిసార్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, మీడియాను కూడా కనీసం 200 మీటర్ల దూరంలోనే నిలిపివేశారు. ఎమ్మెల్యేలు ఎవరితోనూ మాట్లాడకుండా, బయటి వ్యక్తులు లోపలికి వెళ్లకుండా గట్టి నిఘా పెట్టారు.

కాంగ్రెస్ తీరుపై హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇలా లగ్జరీ హోటళ్లలో బంధించి ఉంచడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని సాకులు చెబుతూ, మరోవైపు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు రాష్ట్ర అతిథులుగా హోదా ఇచ్చి విలాసవంతమైన ఆతిథ్యం ఇవ్వడం ఏంటని ఆయన ధర్మశాలలో మీడియా సాక్షిగా ప్రశ్నించారు. ఇది అచ్చంగా ప్రజాస్వామ్యాన్ని అపహరించడమేనని ఆయన దుయ్యబట్టారు.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ సభ్యులు కిరణ్ చౌదరి, రామ్ చంద్ర జంగ్డా పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుండటమే ఇందుకు కారణం. ఒక్కో అభ్యర్థి విజయం సాధించాలంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే ఒక స్థానాన్ని గెలుచుకోవడానికి వారికి కావాల్సిన సంఖ్యాబలం ఉంది. కానీ, ఎవరైనా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ (పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం) చేస్తారేమోనన్న భయంతోనే కాంగ్రెస్ ఈ రిసార్ట్ పాలిటిక్స్‌కు తెరలేపింది. బీజేపీ తరపున సంజయ్ భాటియా, సతీష్ నాందల్ బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి కరమ్‌వీర్ సింగ్ బోధ్ పోటీ చేస్తున్నారు. మార్చి 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది, అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి.

CR Reddy

CR Reddy

Next Story