PM Modi about War: యుద్ధంపై మొదటిసారి బహిరంగంగా స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
PM Modi about War:పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై మొట్టమొదటిసరిగా ప్రధాని మోదీ స్పందించారు. లోక్ సభ వేదికగా ఆయన యుద్ధం గురించి.. ప్రభుత్వ వైఖరి గురించి వివరించారు.
PM Modi about War
PM Modi about War: పశ్చిమ ఆసియాలోని సంఘర్షణ పరిస్థితిపై ప్రధాని మోదీ తొలిసారిగా బహిరంగంగా ప్రకటన చేశారు. లోక్‌సభలో 25 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో, ఉద్రిక్తతలు ముగియాలని, ఈ సమస్యకు చర్చలే ఏకైక పరిష్కారమని ఆయన అన్నారు. పౌరులపై, విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి అన్నారు. హోర్ముజ్‌కు వెళ్లే మార్గాన్ని అడ్డుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదగిన చర్య కాదన్నారు. యుద్ధంపై, యుద్ధ పరిస్థితులపై చాలా స్పష్టంగా తమ అభిప్రాయాలను, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ లోక్ సభలో వివరించారు.
భారతీయుల క్షేమమే ముఖ్యం..
దేశంలో చమురు, గ్యాస్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని అన్నారు. ఇందుకోసం, మనం ఇప్పుడు 27 దేశాలకు బదులుగా 41 దేశాల నుంచి గ్యాస్, చమురు దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. పశ్చిమ ఆసియాలో కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. వారి భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ
3,75,000 మంది భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి వచ్చారని ఆయన అన్నారు. ఒక్క ఇరాన్ నుంచే వేలాది మంది సురక్షితంగా తిరిగి వచ్చారు. వారిలో 700 మందికి పైగా వైద్య విద్యను అభ్యసిస్తున్న యువకులు ఉన్నారని చెప్పారు.
ప్రధాని మోదీ ప్రసంగంలో కీలకాంశాలు ఇవే..
చమురు, గ్యాస్ సంక్షోభంపై:
ప్రస్తుతం 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. “ప్రభుత్వం వివిధ దేశాల సరఫరాదారులతో సంప్రదింపులు జరుపుతోంది. సాధ్యమైన అన్ని చోట్ల నుండి సరఫరాలు కొనసాగేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చమురు, గ్యాస్, ఎరువులను తీసుకువచ్చే ఓడలు భారతదేశానికి సురక్షితంగా చేరేలా చూసేందుకు మేము మా భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నాము.” అని చమురు, గ్యాస్ సంక్షోభంపై చెప్పారు ప్రధాని.
ఆహార రేషన్ల గురించి:
మన వద్ద తగినంత ఆహార నిల్వలు ఉన్నాయనీ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గతంలో కూడా, ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడ్డాయి. అప్పుడు కూడా భారతీయ రైతులకు ఒక బస్తా యూరియాను 300 రూపాయల కన్నా తక్కువ ధరకే అందించడం జరిగిందాని ప్రధాని గుర్తుచేశారు.
భారతీయుల భద్రత:
ఈ సంక్షోభ సమయంలో భారతీయుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యతగా ఉందని చెప్పారు. ప్రస్తుతం, 375,000 మంది భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి వచ్చారు. ఒక్క ఇరాన్ నుంచే వేలాది మంది సురక్షితంగా తిరిగి వచ్చారు. వారిలో 700 మందికి పైగా యువ వైద్య విద్యార్థుఉన్నారని వివరించారు.
విద్యుత్ సరఫరా :
యుద్ధం వల్ల ఎదురవుతున్న ఒక సవాలు ఏమిటంటే, దేశంలో వేసవి కాలం ప్రారంభమవుతోంది. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుంది. దేశంలోని విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి నుండి సరఫరా వరకు ప్రతి వ్యవస్థను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రధాని వెల్లడించారు.
ఇంధన రంగం:
నేటి ఆర్థిక వ్యవస్థకు ఇంధనం వెన్నెముక అని మనకు తెలుసు. ప్రపంచ అవసరాలకు పశ్చిమ ఆసియా ఒక మూలం. భారతదేశంపై ఈ యుద్ధం ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి తాము ఒక వ్యూహంపై పనిచేస్తున్నామన్నారు. దిగుమతి, ఎగుమతులలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది, అది ప్రతిరోజూ సమావేశమై అవసరమైన చర్యలను తీసుకుంటుంది అని ప్రధాని చెప్పారు.
సంఘర్షణ:
దౌత్యపరంగా భారతదేశ వైఖరి స్పష్టం. మేము మా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాము. నేను పశ్చిమ ఆసియా నాయకులతో మాట్లాడి, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అందరినీ కోరాను. వాణిజ్య నౌకలపై దాడులు, వాటికి ఆటంకాలు కలిగించడం ఆమోదయోగ్యం కాదు. వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాలని భారతదేశం అన్ని పక్షాలను ప్రోత్సహిస్తుంది అంటూ ప్రధాని కీలక విషయాలను లోక్ సభలో వెల్లడించారు.




