Gas Booking : వంట గ్యాస్ కష్టాలకు చెక్.. కేంద్రం బంపర్ హామీ..ఊపిరి పీల్చుకున్న సామాన్యుడు

Gas Booking : పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. గ్యాస్, పెట్రోల్ సరఫరా స్థిరంగా ఉందని, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

CR Reddy
Published on: 16 March 2026 6:31 AM IST
Gas Booking
X

Gas Booking

Gas Booking : పశ్చిమాసియాలో రాజుకుంటున్న యుద్ధ జ్వాలలు ఎక్కడ తమ వంటింటిపై ప్రభావం చూపుతాయో అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని, వంట గ్యాస్ దొరకదేమోనన్న భయంతో చాలామంది ముందుగానే సిలిండర్లను బుక్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. అయితే, ఈ భయాల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు రావని స్పష్టం చేయడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.

ప్రభుత్వ హామీతో గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న పానిక్ బుకింగ్‌లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గణాంకాలను గమనిస్తే.. రోజువారీ ఎల్పీజీ బుకింగ్‌లు 8.88 మిలియన్ల నుంచి 7.7 మిలియన్లకు పడిపోయాయి. అంటే ప్రజల్లో కొరత ఏర్పడుతుందనే భయం క్రమంగా తొలగుతోంది. మరో విశేషమేమిటంటే, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగకుండా జనం ఇప్పుడు డిజిటల్ బాట పట్టారు. ఆన్‌లైన్ గ్యాస్ బుకింగ్స్ 84 శాతం నుంచి 87 శాతానికి పెరగడం డిజిటల్ ఇండియా వేగాన్ని సూచిస్తోంది. చమురు కంపెనీలు కూడా క్యాష్‌లెస్ పద్ధతిని ప్రోత్సహిస్తూ క్యూలైన్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా భారత్ ఢోకా లేదు అంటోంది. మన దేశంలోని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం శాఖ ప్రకటించింది. మనం ఇప్పుడు ఇంధన ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామని, కాబట్టి విదేశీ ఉద్రిక్తతలు ఉన్నా మన పంపిణీ వ్యవస్థ సురక్షితంగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఏ పెట్రోల్ బంకులోనూ నో స్టాక్ బోర్డులు కనిపించకుండా చమురు సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

ఇదే సమయంలో కొరతను సాకుగా చూపి అక్రమాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్న ముఠాలపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు మళ్లించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీలపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక వ్యూహాన్ని సిద్ధం చేసింది. గృహ వినియోగదారులు, ఆసుపత్రులు, స్కూళ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే, పారిశ్రామిక వినియోగాన్ని 80 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. అలాగే, ఇంట్లో పైప్‌లైన్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్నవారు తమ పాత ఎల్పీజీ కనెక్షన్లను వదులుకోవాలని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీనివల్ల గ్యాస్ సిలిండర్ల అవసరం ఉన్న పేదలకు మరింత వేగంగా సరఫరా చేసే వీలుంటుందని అధికారులు వివరిస్తున్నారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, మన ఇంధన కోట మాత్రం పటిష్టంగానే ఉందని కేంద్రం భరోసా ఇస్తోంది.

CR Reddy

CR Reddy

Next Story