Gas Usage: గ్యాస్ జాగ్రత్తగా వాడమని చెప్పిన అత్తగారు.. కోడలు ఏం చేసిందంటే..

Gas Usage: వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంటిలో వాడే గ్యాస్ విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు. ఒక అత్తగారు కోడలికి కట్టెల పొయ్యిపై వంట చేయమన్నందుకు పెద్ద రాద్ధాంతం జరిగింది.

KVD Varma
Published on: 17 March 2026 2:55 PM IST
Gas Usage: వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంటిలో వాడే గ్యాస్ విషయంలో జాగ్రత్తలు
X

Gas Usage

Gas Usage: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్‌పురి జిల్లాలో వంట గ్యాస్ వినియోగం విషయంలో అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన చిన్న వివాదం కాస్తా పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కే వరకు వెళ్లింది. ప్రస్తుతం వంట గ్యాస్ దొరకడం కష్టంగా ఉందని జాగ్రత్తగా వాడాలని అత్తగారు తన కోడలికి చెప్పింది. కొంత వంట కట్టెల పొయ్యిపై చేసుకోవాలని సూచించింది. దీంతో ఆ కోడలు తనను అత్తగారు వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ కు చేరింది. వంట గ్యాస్ కష్టాలకు ఈ ఘటన ఒక ఉదాహరణగా మారిందిప్పుడు.

సాధారణంగా కుటుంబాల్లో చిన్నపాటి మనస్పర్థలు రావడం సహజం. కానీ మెయిన్‌పురి జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ అయిపోవడానికి దగ్గరగా ఉండటంతో, కొత్త సిలిండర్ వచ్చే వరకు జాగ్రత్తగా వాడుకోవాలని అత్త తన కోడలికి సూచించింది.

కేవలం గ్యాస్ పొదుపు చేయమని చెప్పడమే కాకుండా, వీలైతే కొన్ని రోజుల పాటు బయట ఉన్న కట్టెల పొయ్యి మీద వంట చేయాలని అత్త కోరింది. ప్రస్తుత కాలంలో ఆధునిక సౌకర్యాలకు అలవాటు పడిన కోడలికి ఈ సూచన ఏమాత్రం నచ్చలేదు. కట్టెల పొయ్యి మీద వంట చేయడం కష్టమని, తనను ఇబ్బంది పెట్టడానికే అత్త ఇలాంటి నిబంధనలు పెడుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వివాదం ముదిరింది. అత్త కావాలనే గ్యాస్ కొరత ఉందని అబద్ధం చెబుతోందని కోడలు ఆరోపించింది. దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని తాను టీవీ వార్తల్లో చూశానని, తనను శారీరకంగా, మానసికగా వేధించడానికే కట్టెల పొయ్యిపై వంట చేయమని ఒత్తిడి చేస్తున్నారని ఆమె వాదించింది.

ఈ క్రమంలో కోడలు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తన అత్తపై ఫిర్యాదు చేస్తూ, తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. ఇంట్లో గ్యాస్ ఉన్నప్పటికీ తనతో కట్టెల పొయ్యి మీద వంట చేయిస్తున్నారని పోలీసులకు వివరించింది. కోడలు ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులకు మతి పోయింది. అయితే, కోడలి పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే అత్తను కూడా స్టేషన్‌కు పిలిపించారు. ఇంటి బడ్జెట్ దృష్ట్యా, సిలిండర్ బుకింగ్ ఆలస్యం అవుతుందన్న భయంతోనే తాను అలా చెప్పానని అత్త పోలీసులకు వివరణ ఇచ్చింది. కోడలిని వేధించాలనే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేసింది.

పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇది నేరం కిందకు రాదని, కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన అవగాహన లోపమని వారు గుర్తించారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు పోలీస్ స్టేషన్‌కు రావడం వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా, కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని వారిద్దరికీ నచ్చ చెప్పారు.

చివరికి పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయకుండానే, పరస్పరం సర్దుబాటు చేసుకుని ఉండాలని సూచించి వారిని ఇంటికి పంపించి వేశారు. ఇంటి సమస్యలను ఇంట్లోనే పరిష్కరించుకోవాలని, అనవసరపు పట్టింపులకు పోవద్దని కోడలికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం LPG ధరలు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో సరఫరాలో అప్పుడప్పుడు జాప్యం జరగడం వల్ల చాలా కుటుంబాలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. అయితే, ఇలాంటి ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఒక్కోసారి కుటుంబ కలహాలకు దారితీస్తున్నాయనడానికి ఈ మెయిన్‌పురి ఘటనే నిదర్శనం.

KVD Varma

KVD Varma

Next Story