LPG Ship: మంగళూరు చేరుకున్న ఎల్‌పీజీ నౌక..భారత్ కు భారీ ఊరట!
LPG Ship: అమెరికా నుంచి ఎల్‌పీజీ నౌక మంగళూరు చేరుకుంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఉన్నా భారత్‌కు ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది.
LPG Ship
LPG Ship: అమెరికాలోని టెక్సాస్ నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి)ను తీసుకువస్తున్న ఒక సరుకు రవాణా నౌక మంగళూరులోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. గత వారం రోజుల్లో, గ్యాస్, ముడి చమురును తీసుకువస్తున్న సుమారు నాలుగు నౌకలు సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్నాయి.
అంతకుముందు, మార్చి 18న, భారత జెండాతో 'జగ్ లడ్కి' అనే ముడి చమురు ట్యాంకర్ గుజరాత్‌లోని అదానీ పోర్ట్స్‌కు చేరుకుంది. సుమారు 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను తీసుకువచ్చిన మరో రెండు ఎల్‌పిజి క్యారియర్‌లు, 'ఎమ్‌టి శివాలిక్' - 'ఎమ్‌టి నందా దేవి', మార్చి 16 -17 తేదీలలో భారతదేశానికి చేరుకున్నాయి. అయితే, ఈ మూడు నౌకలూ హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించాయి.
సుమారు 22 భారతీయ నౌకలు ఇప్పటికీ పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయాయి. అయితే, అవన్నీ సురక్షితంగా ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్‌లోని హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన నౌకా రవాణా మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% దీని గుండానే వెళుతుంది.
LPG Ship: మార్చి 16న భారత జెండా కలిగిన 'జగ్ లడ్కీ' అనే ముడి చమురు ట్యాంకర్ గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ (అదానీ పోర్ట్స్)కు చేరుకుంది. ఈ ట్యాంకర్ సుమారు 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువస్తోంది. ఈ చమురు యూఏఈ నుంచి వచ్చి, ఫుజైరా పోర్ట్‌లో లోడ్ అయింది
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రకారం, మార్చి 17న నందా దేవి అనే ఓడ సుమారు 46,000 టన్నుల ఎల్‌పిజితో భారతదేశానికి చేరుకుంది. ఈ ఓడ గుజరాత్‌లోని వడినార్ (జామ్‌నగర్) పోర్టుకు చేరుకుంది.
ఎల్‌పిజి సంక్షోభం..
అమెరికా - ఇజ్రాయెల్ దేశాలు 2026 ఫిబ్రవరి 28న, ఇరాన్‌పై సంయుక్తంగా దాడి చేశాయి. ఈ దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో సహా పలువురు అధికారులు మరణించారు. అమెరికా దీనికి 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టింది.
ఈ యుద్ధం హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు, సరఫరా అంతరాయాలకు దారితీసింది. భారతదేశానికి అవసరమైన ఎల్‌పిజి దిగుమతులలో 80-85% ఈ జలసంధి నుండే అందుతాయి. ప్రపంచంలోనే ఎల్‌పిజిని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. దేశానికి అవసరమైన ఎల్‌పిజిలో 60 శాతానికి పైగా ఇక్కడి నుండే దిగుమతి అవుతుంది.
దీనివల్ల భారతదేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడింది, కానీ వదంతులను నమ్మవద్దని భారత ప్రభుత్వం ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేసింది. దేశంలో ఎల్పీజీకి గానీ, చమురుకు గానీ కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
హోర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే 167 కిలోమీటర్ల పొడవైన జలమార్గం. ఇరాన్ యుద్ధం కారణంగా, ఈ మార్గం ఇప్పుడు సురక్షితంగా లేదు. ప్రమాదం కారణంగా, ప్రస్తుతం ఏ చమురు ట్యాంకర్లూ దీని గుండా ప్రయాణించడం లేదు. ప్రపంచ పెట్రోలియంలో 20 శాతం దీని గుండా వెళుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి దేశాలు కూడా తమ ఎగుమతుల కోసం దీనిపై ఆధారపడి ఉన్నాయి.
సంక్షోభంలో ప్రభుత్వ సత్వర చర్యలు..
ఎల్‌పిజి సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం వేగంగా వెతికింది. అలాగే, హార్ముజ్ వద్ద చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా తీసుకురావడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే మూడు షిప్స్ భారత్ చేరుకున్నాయి. ఇప్పుడు నాలుగోది అమెరికాలోని టెక్సాస్ నుంచి మంగుళూరు చేరుకుంది. ఒక పక్క ఎల్‌పిజిని దేశానికి తీసుకురావడంపై వేగంగా స్పందించిన భారత్, మరోవైపు దేశీయంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కఠిన చర్యలు తీసుకుంది. బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టే దానిలో భాగంగా వంట గ్యాస్ వినియోగదారులకు ఓటీపీ విధానం ద్వారా డెలివరీ తప్పనిసరి చేసింది. అలాగే, వాణిజ్య సిలెండర్లను మొదట సప్లై పూర్తిగా నిలిపివేసిన ప్రభుత్వం పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత విడుదల చేసింది. దీంతో తాత్కాలికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ, క్రమేపీ పరిస్థితులు సర్దుమణిగాయి.




