Jammu University: జమ్మూ వర్సిటీ సిలబస్ వివాదం..జిన్నా అంశాల తొలగింపునకు సిఫార్సు

Jammu University Syllabus: జమ్మూ విశ్వవిద్యాలయం ఎంఏ పొలిటికల్ సైన్స్ సిలబస్ నుండి మహమ్మద్ అలీ జిన్నా అంశాలను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసింది.

KVD Varma
Published on: 23 March 2026 12:53 PM IST
Jammu University : జమ్మూ విశ్వవిద్యాలయం ఎంఏ పొలిటికల్ సైన్స్ సిలబస్
X

Jammu University 

Jammu University: జమ్మూ విశ్వవిద్యాలయంలోని ఎంఏ పొలిటికల్ సైన్స్ సిలబస్ నుండి మహమ్మద్ అలీ జిన్నా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఇక్బాల్‌లకు సంబంధించిన అంశాలను తొలగించాలని సిఫార్సు చేసింది. డిపార్ట్‌మెంటల్ అఫైర్స్ కమిటీ (డీఏసీ) ఈ రికమండేషన్స్ చేసింది. ఈ సిఫారసులపై మార్చి 24న జరిగే బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు సిలబస్‌పై వివాదాన్ని ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అంటోంది.

వివాదం ఏమిటి?

ఎంఏ పొలిటికల్ సైన్స్ సిలబస్‌లోని 'మైనారిటీలు- దేశం' అనే పేపర్‌లో జిన్నా రాజకీయ అభిప్రాయాలను చేర్చడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ అంశాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) శనివారం విశ్వవిద్యాలయం వద్ద నిరసన తెలిపింది. విద్యా స్వేచ్ఛ పేరుతో జాతీయ భావాలను, చారిత్రక వాస్తవాలను విస్మరించలేమని ఆ సంస్థ పేర్కొంది.

ఏబీవీపీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర కార్యదర్శి సన్నక్ శ్రీవత్స మాట్లాడుతూ, గతంలో జిన్నాను 'ద్విజాతి సిద్ధాంతం' సందర్భంలో ప్రస్తావించడం ద్వారా దేశ విభజన భావనకు ఆయనను ముడిపెట్టారని అన్నారు. ఇప్పుడు, సవరించిన సిలబస్‌లో ఆయనను 'మైనారిటీలు - దేశం' అనే శీర్షిక కింద మైనారిటీల నాయకుడిగా చూపిస్తున్నారని చెప్పారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

విద్యాపరమైన దృక్కోణంలోని అంశాలు

పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ బల్జిత్ సింగ్ మాన్ మాట్లాడుతూ, జిన్నా, ఇతర మేధావులను విద్యాపరంగా చేర్చడం జరిగిందని అన్నారు. ఇది జాతీయ పాఠ్యప్రణాళిక, యూజీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ఆయన తెలిపారు. విద్యార్థులకు విభిన్న దృక్కోణాలను పరిచయం చేయడమే దీని లక్ష్యం అని చెబుతున్నారు. అయితే, వివాదం అనంతరం, ఈ విషయంపై విచారణ జరిపేందుకు విశ్వవిద్యాలయ పరిపాలన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఉద్దేశపూర్వకంగా వివాదాన్నిసృష్టిస్తున్నారు..

సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, జేకేపీసీసీ ప్రధాన కార్యదర్శి నమ్రతా శర్మ మాట్లాడుతూ, సిలబస్‌కు సంబంధించిన వివాదాన్ని ఉద్దేశపూర్వకంగానే రేకెత్తిస్తున్నారని అన్నారు. 2025లో సిద్ధం చేసిన ముసాయిదా సిలబస్‌లో జిన్నా, సావర్కర్, గోల్వాల్కర్‌లకు సంబంధించిన విభాగాన్ని చేర్చారని, అయితే 11-12 నెలల పాటు దానిపై ఎటువంటి ప్రశ్నలు తలెత్తలేదని ఆమె అన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా దానిని ఒక సమస్యగా మారుస్తున్నారని ఆమె తెలిపారు.

ఇది మొదటిసారి కాదు..

విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ విభాగం వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. 2018లో, భగత్ సింగ్‌ను ఉగ్రవాది అని పిలుస్తూ ఒక ప్రొఫెసర్ చేసిన వీడియో వివాదాన్ని రేకెత్తించింది. దీనిపై అప్పట్లో చాలా గందరగోళం రేగింది.

అలాగే ఫిబ్రవరి 24న, NCERT 8వ తరగతి విద్యార్థుల కోసం ఒక కొత్త సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పాఠ్యపుస్తకాన్ని 2026-27 విద్యా సంవత్సరం నుండి పాఠశాలల్లో బోధించాల్సి ఉంది. దీని మొదటి భాగం 2025 జూలైలో విడుదలైంది.

ఈ పుస్తకం పేరు 'ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ పార్ట్ 2'. 'మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర' అనే అధ్యాయంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే అంశాన్ని చేర్చారు. కోర్టుల అధికార శ్రేణి, న్యాయం పొందే అవకాశం గురించి వివరించడానికి బదులుగా, ఇది అవినీతి, కేసుల పెండింగ్ వంటి న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి పెట్టింది. ఈ వివాదం నేపథ్యంలో, పుస్తకాన్ని నిషేధించారు. సీజేఐ కూడా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

KVD Varma

KVD Varma

Next Story