Delhi Pollution : వాహనదారుల నడ్డి విరిచేలా కొత్త చట్టం.. బండి తీయాలంటే ఇక వెన్నులో వణుకు ఖాయం
Delhi Pollution : ఢిల్లీలో కాలుష్యం, ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రభుత్వం 'కంజషన్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేయనుంది. రద్దీ సమయాల్లో రోడ్లపై వాహనాలు నడిపితే వాహనదారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Delhi Traffic Alert Pay to Drive on Roads?
Delhi Pollution : దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల రద్దీని తగ్గించి, కాలుష్య కోరల నుంచి నగరాన్ని విముక్తి చేసేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రోడ్లను ఉచిత పబ్లిక్ ప్రాపర్టీగా కాకుండా, ఛార్జీలు వసూలు చేసే వనరుగా మార్చాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే కంజషన్ ప్రైసింగ్(Congestion Pricing) విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అంటే ఇకపై రద్దీ సమయాల్లో మీరు ఢిల్లీ రోడ్లపైకి కారు తీయాలంటే జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
గురువారం ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మజిందర్ సింగ్ సిర్సాతో నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కాలుష్యాన్ని అరికట్టేందుకు పలు కీలక సూచనలు చేసింది. కేవలం రద్దీ సమయాల్లో రోడ్లపై ఫీజు వసూలు చేయడమే కాకుండా, పాత వాహనాల స్క్రాపింగ్, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సెంటర్ల పెంపు, నిర్మాణ రంగం నుంచి వచ్చే ధూళిని అరికట్టడం వంటి అంశాలపై చర్చించారు. మంత్రి సిర్సా మాట్లాడుతూ.. కాలుష్య మూలాలను గుర్తించి ఏరియా వారీగా వ్యూహాలను అమలు చేస్తామని, త్వరలోనే వీటిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
అసలు ఏంటీ కంజషన్ ప్రైసింగ్ ? రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్) ప్రధాన రహదారులపై వాహనాలను అనుమతించడానికి ఫీజు వసూలు చేసే పద్ధతి ఇది. దీనివల్ల అనవసరమైన ప్రయాణాలు తగ్గుతాయని, ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వైపు మొగ్గు చూపుతారని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆఫీసులు, విద్యా సంస్థల పనివేళల్లో మార్పులు చేయడం ద్వారా ట్రాఫిక్ చిక్కులను వీడదీయవచ్చని ప్యానెల్ సూచించింది.
ఇలాంటి ఫీజు వసూలు చేయడం మన దేశానికి కొత్త కావొచ్చు కానీ, ప్రపంచంలోని పలు మెట్రో నగరాల్లో ఇది ఎప్పటి నుండో అమల్లో ఉంది. లండన్‌లో ఒక రోజుకు దాదాపు రూ.1600 వరకు వసూలు చేస్తుండగా, స్టాక్‌హోమ్‌లో రూ.1000, న్యూయార్క్‌లో రూ.1250 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సింగపూర్‌లో ప్రతి ఎంట్రీకి రూ.30 నుంచి రూ.350 వరకు తీసుకుంటారు. ఇప్పుడు ఢిల్లీ కూడా అదే బాటలో నడవాలని ఫిక్స్ అయ్యింది.
కేవలం వాహనాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కాలుష్యం (Transboundary Pollution) కూడా ఢిల్లీకి పెద్ద సవాలుగా మారింది. దీనిని అరికట్టేందుకు స్థానిక స్థాయిలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెత్తను తగులబెట్టడం, నిర్మాణ పనుల వల్ల వచ్చే ధూళిపై నిఘా పెంచనున్నారు. మొత్తానికి ఢిల్లీ గాలిని శుభ్రం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ఖరీదైన చర్యలు వాహనదారులకు ఎంతవరకు రుచిస్తాయో వేచి చూడాలి.




