Work From Home: మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ బాట పట్టిన టెక్ కంపెనీలు
Work From Home: వంట గ్యాస్ కొరత దేశవ్యాప్తంగా తీవ్రం అవుతోంది. ఈ క్రమంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగాలకు ఇంటి నుంచి పని చేసే విధానానికి మార్చాలని ఆలోచిస్తున్నాయి.
Work From Home
Work From Home: క్రమ క్రమంగా మధ్యప్రాచ్య యుద్ధ సెగ అన్ని రంగాలకు పాకుతోంది. ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు ఇంకా పెద్దగా మొదలవలేదు. కానీ, వంట గ్యాస్ కి సంబంధించి దేశవ్యాప్తంగా ఇబ్బందులు తెస్తోంది. దేశమంతా వంట గ్యాస్ కొరత ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలెండర్ ఖరీదు పెరగడమే కాకుండా.. అవి దొరకడం కూడా కష్టంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హోటల్స్ మూత పడటం లేదా.. తమ మెనూని తగ్గించడం వంటివి చేశాయి. అలాగే పీజీలు మూతపడుతున్నాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం సిటీల పై ఆధారపడిన వారికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
తాజాగా వంట గ్యాస్ సెగ కార్పొరేట్ సంస్థలకు కూడా పాకింది. వంట గ్యాస్ లభ్యత తగ్గడంతో కార్పొరేట్ కంపెనీలు తమ క్యాంటీన్లలో ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టాయి. ఇక చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలోకి మారుతున్నాయి. కరోనా నేపథ్యంలో చాలా కాలం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో నడిచిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడిప్పుడే రిమోట్ మోడల్ లేదా పూర్తి స్థాయిలో ఆఫీసు నుంచి పని చేయడానికి మారాయి. ఇంతలోనే యుద్ధం కారణంగా ఇప్పుడు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని విధానానికి మార్చే ఆలోచన చేస్తున్నాయి. ప్రస్తుతం అందరికీ రిమోట్ మోడ్ లో పనిచేయాలని సూచిస్తున్నాయి.
Work From Home: కార్పొరేట్ కంపెనీల క్యాంటీన్స్ కు వాణిజ్య గ్యాస్ పొందడం కష్టంగా ఉంది. వారు ప్రతిరోజూ తమ ఉద్యోగులకు వంట చేయాల్సి ఉంటుంది. అందువల్ల, కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని సౌకర్యాలను కల్పించాలని ఆలోచిస్తున్నాయి. బెంగళూరులో HCLTech రెండు రోజులు ఇంటి నుండి పని చేయాలని ఉద్యోగులను కోరింది. HCL టెక్ చెన్నై కార్యాలయంలోని ఉద్యోగులు ఈరోజు రేపు, మార్చి 12 , 13 తేదీలలో ఇంటి నుండి పని చేయాలని కోరినట్లు మింట్ ఒక రిపోర్ట్ లో వెల్లడించింది.
HCL టెక్ వంటి కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించగా, అనేక ఇతర కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల కోసం భద్రతా ప్రోటోకాల్‌లను అమలు చేశాయి. ఎల్పిజి కొరత కారణంగా బెంగళూరులోని తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న తమ కెఫెటేరియాలో ఆహార కొరత ఉందని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తెలియజేసింది. లైవ్ ఫుడ్ కౌంటర్లను నిలిపివేసింది. ఇంటి నుండే వంట చేసుకుని క్యారేజీలు తీసుకురావాలని కంపెనీ కోరింది. చెన్నైలోని ఇన్ఫోసిస్ కార్యాలయ ఉద్యోగులకు కూడా ఇదే సలహా ఇచ్చినట్లు తెలిసింది.
పరిస్థితి ఇలానే కొనసాగితే, కంపెనీలు ఇంటి నుంచి పని చేసేవిధంగా ఉద్యోగులకు సూచనలు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
వంట గ్యాస్ సరఫరాలో ప్రస్తుతం ఎటువంటి సమస్య లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దేశంలోని చాలా ప్రాంతాల్లో LPG సిలిండర్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాణిజ్య గ్యాస్ - గృహ వినియోగ LPG రెండూ వంట గ్యాస్ కి సంబంధించినవే. ఇంటికి సంబంధించిన వంట గ్యాస్ కూడా ఇప్పుడు దొరకడం కష్టంగా మారింది. . గృహ వినియోగ గ్యాస్ పొందడం కూడా కష్టంగా మారింది.




