Ustad Bhagat Singh Pre Release: ప్రేమించే గోత్రం..సేవ చేసే నక్షత్రం..పవన్ కళ్యాణ్ ఉస్తాద్ స్పీచ్
Ustad Bhagat Singh Pre Release: ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో అభిమానుల్లో జోష్ నింపారు. అభిమానులు లేకపోతే తాను లేనన్నారు
Ustad Bhagat Singh Pre Release
మీరు లేకపోతే నేను లేను.. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు జోష్ తెప్పించేశారు. హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో ఆదివారం రాత్రి జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ సినిమా మీద తన ప్రేమను.. అభిమానులపై తనకున్న మమకారాన్ని మరోసారి తన స్పీచ్ లో ఆవిష్కరించారు. అప్పట్లో అని అంటూ తనను బీసీ కాలానికి నెట్టేస్తున్నారు. ఈ మధ్యనే ఓజీ సినిమా వచ్చింది అనే విషయాన్ని మర్చిపోతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
సినిమా అంటే నాకు చాలా ఇష్టం.. నాకు అన్నం పెట్టింది.. ఇప్పుడు ప్రజలకు సేవలు అందించే అవకాశం ఇచ్చింది సినిమా. ఆస్కార్ వరకూ వెళ్లిన తెలుగు సినిమాలో ఒక చిన్న భాగం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ తనకు సినిమాపై ఉన్న ఇష్టాన్ని వెల్లడించారు.
కలెక్షన్లు ఎంత అనేది నేను ఎప్పుడూ అడగలేదు. దర్శకుడిని నమ్మితే సినిమాలో ఆయన చెప్పింది చేసుకుపోవడమే తప్ప మరో విషయం ఎప్పుడూ ఆలోచించాను అన్నారు పవన్. నాకు ఒకే ఒక్క హీరో చిరంజీవి. ఆయన తన అభినందనలు ట్వీట్ చేశారు. అలాగే పెద్ది రామ్ చరణ్ ట్రైలర్ గురించి ట్వీట్ చేశారని చెబుతూ వారికి తన ధన్యవాదాలు తెలిపారు.
మీలో ఒకరు దర్శకుడు అయితే ఎలా ఉంటుందో.. హరీష్ శంకర్ ని చూస్తే తెలుస్తుంది. నాకు గుర్రపుస్వారీ రాదు అయినా గబ్బర్ సింగ్ సినిమాలో నాతో గుర్రపుస్వారీ చేయించారు. హరీష్ నా నుంచి చాలా ఆశిస్తాడు. అభిమానులకు ఏమి కావాలో.. అభిమానులకు నేను ఎలా కనిపిస్తే బావుంటుందో అన్నీ హరీష్ నాతో చేయించుకున్నాడు. హరీష్ కు ఈ సందర్భంగా ధన్యవాదములు చెబుతున్నాను అన్నారు పవన్ కళ్యాణ్.
ఇక కష్టపడి సినిమా చేయడం వరకే తమ చేతుల్లో ఉంటుంది కానీ, దాని రిజల్ట్ మాత్రం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని చెప్పిన పవన్.. ఈ సినిమా మోసం హరీష్ శంకర్ దగ్గర నుంచి అందరూ చాలా కష్టపడ్డారని చెప్పారు. సినిమా చాలా ఆలస్యం అయింది. దానికి చాలా కారణాలున్నాయి. అయితే, ఇప్పుడు 40-45 రోజుల్లో సినిమాని ఫినిష్ చేశారు. ఈ సినిమా కోసం హరీష్ చేసిన ప్లానింగ్ చూస్తే నాకు ఇంకా సినిమాలు చేయాలనే ఆశ కలుగుతోంది.. ఇంకా చెప్పాలంటే నాకు ధైర్యాన్నిచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ను పొగడ్తలతో ముంచేశారు.
ఇక మూవీలో డైలాగ్ చెప్పమని అభిమానులు కోరగా.. తాను ఇచ్చిపడేసే గోత్రం లాంటి డైలాగులు సినిమాల్లో చెబితే బావుంటుంది కానీ.. బయట అలా చెప్పలేనన్నారు. అందుకే, మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం అంటూ తనదైన స్టైల్ లో డైలాగ్ చెప్పి అభిమానులలో జోష్ నింపేశారు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈనెల 19న ఉగాది కానుకగా విడుదల కాబోతోంది. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూవీ అనగానే అభిమానుల్లో సందడి వచ్చేసింది. సినిమా ట్రైలర్ వచ్చిన తరువాత అది మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ మూవీపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో అందరూ ఉన్నారు.




