Ustad Bhagat Singh: 'ఉస్తాద్' హిట్ కావడం నాకు చాలా ముఖ్యం.. శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు!

Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉస్తాద్ హిట్ కావడం తనకు చాలా ముఖ్యం అని చెప్పారు.

Rishvik
Published on: 18 March 2026 5:37 PM IST
Ustad Bhagat Singh
X

Ustad Bhagat Singh: 'ఉస్తాద్' హిట్ కావడం నాకు చాలా ముఖ్యం.. శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు! 

Ustad Bhagat Singh:'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రం 2026 ఉగాది కానుకగా రేపు (మార్చి 19) ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది . మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా.. తెలుగమ్మాయి శ్రీలీల, ఢిల్లీ భామ రాశి ఖన్నా కథానాయికలుగా నటించారు.

సినిమా చాలా బాగా వచ్చింది:

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ దసపల్లాలో చిత్ర యూనిట్ గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత నవీన్ ఎర్నేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు సహా హీరోయిన్లు శ్రీలీల, రాశి ఖన్నా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇటీవల డబ్బింగ్ చేస్తూ కొన్ని సీన్స్ చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ ఉగాదికి మంచి తెలుగు సినిమా చూశాం అనే అనుభూతి ప్రేక్షకులకు తప్పకుండా కలుగుతుంది' అని శ్రీలీల తెలిపారు.

సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా:

అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విజయం తమకు ఎంతో ముఖ్యమని శ్రీలీల వెల్లడించారు. 'ఉస్తాద్ సినిమా హిట్ కావడం నాకు, రాశి ఖన్నాకు చాలా అవసరం. మేమిద్దరం కూడా ఈ విషయంపై మొన్ననే చర్చించుకున్నాం, సినిమా హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నాం' అని శ్రీలీల చెప్పడం విశేషం. ఇటీవల శ్రీలీల నటించిన మాస్ జాతర, పరాశక్తి, రాబిన్ హుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో ఉస్తాద్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. మరోవైపు రాశి ఖన్నాకు కూడా వరుస ఫ్లాప్స్ చవిచూశారు. అందుకే ఈ చిత్రం విజయం సాధించడం ఇద్దరికీ చాలా ముఖ్యం.

ఇదే నా మొదటి మూవీ:

హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ...'ఉగాది నూతన సంవత్సరంలోనే కాదు, ఈ ఏడాది 2026లో కూడా ఇదే నా మొదటి మూవీ. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో నటించిన ఫస్ట్ ఫిల్మ్. కాబట్టి చాలా ఎక్సైటింగ్, అదే సమయంలో నెర్వస్ కూడా ఉంది. ఈ సినిమా ఒక్కరి కష్టం కాదు, ఇది ఒక కలెక్టివ్ ఎఫర్ట్. ముఖ్యంగా మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అయితే ఉగాది రోజున ఎలాగైనా రిలీజ్ చెయ్యాలని ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు' అని అన్నారు. మొత్తానికి భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది పండుగకు ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించనున్నట్లు చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.

Rishvik

Rishvik

Next Story