Chinmayi Sripaada: ఆ స్టార్ హీరోను టార్గెట్ చేసుకుని సింగర్ చిన్మయి షాకింగ్ ట్వీట్

Chinmayi Sripaada: ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు రావడంపై సింగర్ చిన్మయి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా వైరముత్తుకు శుభాకాంక్షలు తెలిపిన స్టార్ హీరో కమల్ హాసన్‌పై ఆమె సంచలన విమర్శలు చేశారు.

Naresh.k
Published on: 15 March 2026 11:37 AM IST
Chinmayi Sripaada
X

Chinmayi Sripaada: ఆ స్టార్ హీరోను టార్గెట్ చేసుకుని సింగర్ చిన్మయి షాకింగ్ ట్వీట్

Chinmayi Sripaada: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ మహిళల హక్కుల కోసం, ముఖ్యంగా మీటూ ఉద్యమం ద్వారా తన గళాన్ని వినిపించే చిన్మయి, తాజాగా తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు ఇప్పుడు కోలీవుడ్ మరియు టాలీవుడ్‌లో కార్చిచ్చు రేపుతున్నాయి.

తమిళ సాహిత్య రంగంలో దిగ్గజంగా పేరున్న లిరిసిస్ట్ వైరముత్తుకు ఇటీవల దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన ‘జ్ఞానపీఠ్’ వరించింది. ఈ గౌరవం అందుకున్న మూడో తమిళ వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నుండి పలవురు సినీ ప్రముఖుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఇదే సమయంలో గతంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన చిన్మయి, ఈ పరిణామంపై తీవ్రంగా మండిపడ్డారు.

కమల్ హాసన్‌పై నేరుగా విమర్శలు

ముఖ్యంగా స్టార్ హీరో కమల్ హాసన్, వైరముత్తును అభినందిస్తూ చేసిన పోస్ట్ చిన్మయికి ఆగ్రహం తెప్పించింది. మహిళా సాధికారత గురించి సినిమాల్లోనూ, బయటా మాట్లాడే కమల్.. వాస్తవానికి వచ్చేసరికి బాధితుల పక్షాన నిలబడటం లేదని ఆమె ఎద్దేవా చేశారు.సినిమాల్లో ఉన్న మగవాళ్లు రాజకీయాల్లోకి మారడం సులభమే, కానీ వేధింపులకు గురైన మహిళల గొంతును వినడం మాత్రం వారికి సాధ్యం కాదు. తన గురువు, మామ తమను లైంగికంగా వేధించారని మహిళలు మొత్తుకుంటున్నా పట్టించుకోని నైజం ఆయనదని చిన్మయి శ్రీపాద తెలిపింది.

రాజకీయ పార్టీల్లోనూ అదే వివక్షా?

కమల్ హాసన్ సొంత రాజకీయ పార్టీలోని ఒక మహిళా సభ్యురాలు కూడా గతంలో ఈ కవి (వైరముత్తు) పేరును ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేసినా, కమల్ స్పందించకపోవడాన్ని చిన్మయి తీవ్రంగా తప్పుబట్టారు. "పురుషులు కేవలం తమ సోదరులకు, స్నేహితులకు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారు.. మహిళలను గాలికి వదిలేస్తారు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే మహిళలు.. పురుష నాయకులు ఎప్పటికీ మహిళల పక్షాన ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె ఘాటుగా హెచ్చరించారు.

సింగర్ చిన్మయి గత కొన్నేళ్లుగా వైరముత్తుపై తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆమె డబ్బింగ్ యూనియన్ నుండి బహిష్కరణకు గురవ్వడం, అవకాశాలు తగ్గడం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వెనక్కి తగ్గకుండా సెలబ్రిటీల ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూనే ఉన్నారు. ప్రస్తుతం కమల్ హాసన్‌ను ఉద్దేశించి ఆమె చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు అవార్డుకు, ఆరోపణలకు సంబంధం లేదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా, చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ఒక పెద్ద రాజకీయ, సామాజిక చర్చకు దారితీశాయి.




Naresh.k

Naresh.k

Next Story