Sreeleela : వాళ్లు అలా వేధించేవారు.. శ్రీలీల కన్నీటి పర్యంతం
స్టార్ హీరోయిన్ శ్రీలీల తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న సోషల్ మీడియా వేధింపులపై స్పందించారు.
Sreeleela : వాళ్లు అలా వేధించేవారు.. శ్రీలీల కన్నీటి పర్యంతం
Trolling on Sreeleela : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే 'శ్రీలీల'. వరుస విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా తనదైన డ్యాన్స్, చార్మింగ్ లుక్స్‌తో కుర్రకారు మనసు గెలుచుకున్న ఈ కన్నడ కస్తూరి, ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే, ఈ గ్లామర్ వెనుక తను అనుభవించిన కన్నీటి గాథను తాజాగా బయటపెట్టింది.
హీరోయిన్ ప్రయాణం.. పూలబాట కాదు
'పెళ్లి సందD' చిత్రంతో వెండితెరకు పరిచయమైన శ్రీలీల, అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ల పక్కన మెరిసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతోంది. పుష్ప-2లో 'కిస్సింగ్ సాంగ్'తో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల, అటు కోలీవుడ్‌లో శివకార్తీకేయన్, ధనుష్ సరసన.. ఇటు బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తూ బిజీగా ఉంది. మార్చి 19న విడుదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
సినిమాలు వదిలేద్దాం అనుకున్నా
సినిమా రంగంలో ఎంత గ్లామర్ ఉంటుందో, సోషల్ మీడియాలో అంతకంటే దారుణమైన ట్రోలింగ్ ఉంటుంది. తాజాగా యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. కెరీర్ మొదట్లో నాపై వచ్చే ట్రోల్స్ చూసి చాలా ఇబ్బంది పడేదాన్ని. చిన్నప్పటి నుంచి నేను చాలా సెన్సిటివ్. ఆ నెగిటివ్ కామెంట్స్ చూసి తట్టుకోలేక రాత్రుళ్లు ఏడ్చేదాన్ని. ఒక దశలో అమ్మ దగ్గరికి వెళ్లి.. నేను ఇంక సినిమాలు చేయను, నాకు ఈ వేధింపులు వద్దు.. మళ్లీ కాలేజీకి వెళ్లి చదువుకుంటాను అని చెప్పేశాను" అంటూ ఎమోషనల్ అయ్యింది.
ఇప్పుడు ధైర్యం వచ్చింది
నేటి కాలంలో సోషల్ మీడియా వేధింపులు నటీనటుల మానసిక స్థితిని ఎంతలా దెబ్బతీస్తున్నాయో శ్రీలీల మాటల్లో స్పష్టమైంది. కేవలం తారలే కాదు, వారు నటించిన సినిమాలు కూడా ఈ ట్రోలింగ్ వల్ల దెబ్బతింటున్నాయి. అయితే, ఇప్పుడు తనలో మార్పు వచ్చిందని శ్రీలీల తెలిపింది. ఇప్పుడు ప్రజలు కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఒకరిపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌ను గుడ్డిగా నమ్మడం లేదు. ఆ అనుభవాలే నన్ను ఇప్పుడు ధైర్యంగా నిలబడేలా చేశాయి. ఇప్పుడు ఎలాంటి ట్రోలింగ్‌నైనా ఎదుర్కొనే శక్తి నాకు వచ్చింది అని ధీమా వ్యక్తం చేసింది.




